మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య మరో రగడ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి నారాయణ్ రాణెను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ ధాక్రే చెంప పగలగొడతానని ఆయన వ్యాఖ్యానించడంతో ఆయనపై కేసులు నమోదు చేశారు. నారాయణ్ రాణే కేంద్రమంత్రి మాత్రమే కాదు ..మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా. అదే సమయంలో శివసేనలో చాలా కాలం పాటు అనేక కీలక పదవులు నిర్వహించిన వ్యక్తి కూడా. అయితే ఆయన కొన్నాళ్ల క్రితం బీజేపీలో చేరారు. ఇటీవల జరిపిన మంత్రివర్గ పునర్వవవస్థీకరణలో నారాయణ్ రాణెకు ప్రధాని నరేంద్రమోడీ కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. ఆ ఉత్సాహంలో ఉన్న ఆయన .. బీజేపీ నిర్దేశించినట్లుగా జన ఆశీర్వాద్ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో ఆయన కాస్త ఆవేశానికి గురయ్యారు.
ఆగస్టు పదిహేను వేడుకల సందర్భంగా సీఎం ఉద్దవ్ ధాకరే ప్రసంగంలో మధ్యలో ఉండగా వెనక్కి తిరిగి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందని సహాయకుడిని అడిగారు. ఈ ఘటనను ప్రస్తావించిన నారాయణ్ రాణే ముఖ్యమంత్రికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైందో తెలియకపోవడం సిగ్గుచేటని ఆ సమయంలో తాను అక్కడ ఉండి ఉంటే గట్టిగా చెంప దెబ్బ కొట్టి ఉండేవాడినన్నారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో శివసేన నేతలు తీవ్రంగా స్పందించి, రాణేపై ఫిర్యాదులు చేశారు. పోలీసులు కూడా కేసులు నమోదు చేసుకుని అరెస్టు చేశారు. కేంద్రమంత్రిని అరెస్ట్ చేయడానికి చేపట్టాల్సిన లాంఛనాలన్నీ చేపట్టారు. ముందస్తు బెయిల్ కోసం రాణె చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.
చెంపదెబ్బ కొట్టి ఉండేవాడినని చేసిన వ్యాఖ్యలకే అధికారంలో ఉన్న కేంద్రమంత్రిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ప్రతిక్ష నేత జగన్ కాల్చి చంపినా తప్పు లేదని వ్యాఖ్యానించారు. అయితే అప్పట్లో పోలీసులు కేసులు కూడా పెట్టలేదు. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్ర రాజకీయం ఆసక్తి రేపుతోంది. కేంద్రమంత్రినే అరెస్ట్ చేయిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ హెచ్చరించారు. దీంతో బీజేపీ – శివసేన మధ్య మరోసారి రచ్చ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.