దళితులకు మాత్రమే కాదు భవిష్యత్‌లో బీసీ, మైనార్టీ,అగ్రవర్ణ పేదల బంధు పథకాలను కూడా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ కార్యవర్గ సభ్యులకు తెలిపారు. టీఆర్ఎస్ భవన్‌లో చాలా కాలం తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే తెలంగాణ సాధించుకున్నామని మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటామని కేసీఆర్ కార్యవర్గ సభ్యులకు తెలియచేశారు.
సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కార్యవర్గ సమావేశంలో హుజురాబాద్ ఉపఎన్నిక గురించి ప్రస్తావించలేదని.. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆ అంశంపై ఆలోచిస్తామన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక చాలా చిన్న విషయమని కేటీఆర్ తేల్చేసారు. ఆ నియోజకవర్గం టీఆర్ఎస్‌కు కంచుకోటని.. ఉపఎన్నికతో ప్రభుత్వం కూలిపోయేదేమీ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందని కేటీఆర్ వ్యాక్యానించారు.దళిత బంధుపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేసి చూపించాలన్నారు.
32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ అక్టోబరులో ప్రారంభిస్తారని ..సెప్టెంబరు 2న కేసీఆర్ చేతుల మీదుగా ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ భూమి పూజ చేస్తామన్నారు. అక్టోబరు లేదా నవంబరులో తెరాస ద్విదశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. రెండు దశాబ్దాల్లో అనితర సాధ్యమైన విజయాలను టీఆర్ఎస్ నమోదు చేసిందని.. కేటీఆర్ తెలిపారు. సెప్టెంబరులో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు.