హిట్లో, ఫ్లాపులో.. వసూళ్లు వస్తున్నాయో, రావట్లేదో – పక్కన పెడితే, ప్రతీవారం బాక్సాఫీసు దగ్గర కొత్త సినిమాల హడావుడి కనిపిస్తోంది. జులై చివరి వారం నుంచి మొదలైన ఈ హంగామా.. ఈనెలలో మరింత ఎక్కువైంది. ప్రతీవారం మూడు నాలుగు సినిమాలు వస్తున్నాయి. చిన్నవో – చితకవో – హడావుడి మాత్రం చేస్తున్నాయి. ఎస్.ఆర్.కల్యాణ మండపం, రాజ రాజ చోర – మంచి వసూళ్లు మూటగట్టుకున్నాయి. ఈవారం కూడా రెండు సినిమాలు రెడీ అయ్యాయి. రెండూ మాస్ సినిమాలే. రెండింటికీ ఓపెనింగ్స్ బాగుండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అవే.. శ్రీదేవి సోడా సెంటర్, ఇచ్చట వాహనములు నిలపరాదు.
పలాసతో ఆకట్టుకున్న దర్శకుడు కరుణ కుమార్. తన రెండో ప్రయత్నం శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమా బయటకు రాకుండానే గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా ఓకే చేసుకున్నాడు కరుణ కుమార్. పలాస ఓ ప్రయోగాత్మక చిత్రంగా నిలిచిపోయి, విమర్శకుల ప్రశంసలు అందుకుంటే – దానికి భిన్నంగా పూర్తి మాస్ అంశాలతో శ్రీదేవి సోడా సెంటర్ ని తీర్చిదిద్దినట్టు అనిపిస్తోంది. ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సుధీర్ బాబు కూడా ఈ సినిమాపై నమ్మకంతో ప్రమోషన్లు భారీగా చేయిస్తున్నాడు. ప్రభాస్ ని దించాడు. మహేష్ అండ ఎలానూ ఉంది. కాస్త మంచి బజ్ వచ్చినా – ఈ సినిమాని లాక్కెళ్లిపోగలడు. ఎలా చూసినా ఈ వారం విడుదలయ్యే రెండు సినిమాల్లో శ్రీదేవి సోడాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు… సుశాంత్ `ఇచ్చట వాహనములు నిలపరాదు` అంటూ హెచ్చరిస్తున్నాడు. టైటిల్ బాగుంది. ఇదే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే ఎలిమెంట్. ప్రచార చిత్రాలూ ఆకట్టుకుంటున్నాయి. కొత్త తరహా కాన్సెప్టుల్ని ప్రేక్షకులు ఇష్టపడున్నారు. స్టార్ కాస్టింగ్ తో సంబంధం లేకుండా.. హిట్స్ ఇస్తున్నారు. ఆ లక్షణాలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి మరి. ఈ రెండూ మాస్ చిత్రాలే. ప్రేక్షకులకు ఇప్పుడు కావల్సింది ఇలాంటి సినిమాలే కాబట్టి – ఈవారం బాక్సాఫీసు కళకళలాడే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.