`రంగస్థలం` ముందు అనసూయ వేరు. ఆ తరవాత వేరు. రంగమ్మత్త గా అనసూయ కనిపించిన తరవాత… తెలుగు చిత్రసీమ తనని చూసే కోణం మారిపోయింది. అనసూయ కోసమే `పుష్ష`లో మరో ఆసక్తికరమైన పాత్ర రాసుకున్నాడు సుకుమార్. సుకుమార్ మనసుపెట్టి ఓ పాత్ర రాస్తే… ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈసారీ అనసూయ తన మార్క్ చూపించడం ఖాయం. మరోవైపు… తనవైన ఐటెమ్ సాంగులు చేసుకుంటూనే ఉంది. సాయిధరమ్ తేజ్ తో `విన్నర్`లో.. అనసూయ పేరుతోనే ఓ పాట చేసేశారు. ఇవి మూడూ.. మెగా చిత్రాలే.
ఇప్పుడు మరో మెగా ఆఫర్ అనసూయని వరించింది. ఈసారి ఏకంగా చిరంజీవి సినిమాలోనే నటించేస్తోంది. `గాడ్ ఫాదర్`లో అనసూయకి ఓ కీలకమైన పాత్ర దక్కింది. ఇది `లూసీఫర్`కి రీమేక్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ రాజా దర్శకుడు. లూసీఫర్ ని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దడంలో ఆయన చాలా మార్పులు చేశారు. ఆ మార్పుల్లో భాగంగా అనసూయ పాత్రని సృష్టించారు. అలా అనసూయ ఈ మెగా రీమేక్లోకి వచ్చి చేరింది. మొత్తానికి అనసూయ తో మెగా కుటుంబానికి బాండింగ్ రోజురోజుకీ బలపడుతోంది. అన్నట్టు `అత్తారింటికి దారేది`లో అనసూయ నటించాల్సింది. ఆ ఛాన్స్ తృటిలో కోల్పోయింది. లేదంటే.. మెగా హీరోలందరితోనూ ఈపాటికే ఓ రౌండ్ వేసేసేదే.