ఏ ప్రభుత్వానికైనా అత్యంత కీలకమైన పోస్టుల్లో ఉండేది ఇంటలిజెన్స్ చీఫ్ పోస్ట్. తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారిగా ఆ పదవిని ఐపీఎస్ అధికారి అనిల్‌కుమార్‌కు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకూ ఆ పోస్టులో
టి.ప్రభాకర్‌రావు ఉన్నారు. ఆయన రిటైర్డ్ అధికారి. రిరైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మూడేళ్లపాటు పొడిగించి, ఇంటలిజెన్స్ చీఫ్ పదవి అప్పగించింది. విశ్రాంత ఐపీఎస్ అధికారికి కీలకమైన నిఘా విభాగం బాధ్యతలు అప్పగించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే అలాంటి అభ్యంతరాలను అప్పట్లో పట్టించుకునే పరిస్థితి లేదు.
తాజాగా ఇంటలిజెన్స్ చీఫ్‌గా నియమితులైన అనిల్ కుమార్ 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు కమిషనర్ గా ఉన్నారు. చాలా కాలంగా ట్రాఫిక్‌లోనే ఉన్నారు. ఆయన హోదా ఏడీజీనే. సాధారణంగా నిఘా విభాగాధిపతిగా ఐజీ స్థాయి అధికారినే నియమిస్తుంటారు. అనిల్‌కుమార్ ఇంకా డీజీ స్థాయికి రాలేదు. అయినప్పటికీ అదనపు డీజీ హోదాలో విధుల్లో చేరనున్నారు. ఇంత హఠాత్తుగా ప్రభాకర్ రావును తొలగించి అనిల్‌కుమార్‌కు ఎందుకు పట్టం కట్టారన్నది రాజకీయవర్గాల్లో సైతం ఆసక్తి రేపుతోంది.
ఇటీవల రేవంత్ రెడ్డి ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కేసులు పెట్టి వేధిస్తున్నారని.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇంద్రవెల్లి దళిత, గిరిజన దండోరా సభలో పదవి నుంచి తప్పుకుని అమెరికా వెళ్లిపోయినా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి మరీ తీసుకొచ్చి ఒక్క దెబ్బకు వంద దెబ్బలు కొడతామని హెచ్చరించారు. అదే సమయంలో ప్రభుత్వంలో పదవులన్నీ ఒకే వర్గానికి ఇస్తున్నారన్న ప్రచారం నేపధ్యంలో కూడా కేసీఆర్ ఇంటలిజెన్స్ చీఫ్ ను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.