జీవోలను ఇక ప్రైవేటుగానే ఉంచాలని ప్రజలకు తెలియకుండా .. ఆఫ్లైన్లో మాత్రమే ఉంటాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన దాఖలయింది. ఆగస్టు 15న ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జర్నలిస్ట్ ఒకరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వ జీవోలను ఆన్లైన్లో ఉంచడం 1990 నుంచి కొనసాగుతోందని సమాచారహక్కు చట్టంలో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా 2008 నుంచి పూర్తి స్థాయిలో పారదర్శకంగా జీవోలను ఆన్లైన్లో ఉంచుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం జీవోలను వెబ్సైట్లో ఉంచకూడదని నిర్ణయించిందని ఇది సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) కి విరుద్ధమన్నారు. సహ చట్టం ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేస్తోందన్నారు. ఉత్తర్వులు సహచట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉంది. జీవోలను రహస్యంగా ఉంచేందుకు అధికారులకు అనుమతిస్తే.. పరిపాలన వ్యవహారమంతా చీకటిమయం అవుతుందని వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించి.. జీవోలన్నింటినీ వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
ఏపీ ప్రభుత్వం ఈ ఆఫ్ లైన్ జీవోల నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ హైకోర్టు కూడా అక్కడి ప్రభుత్వానికి ఇరవై నాలుగు గంటల్లో జీవోలు వెబ్సైట్లో ఉంచాల్సిందేనని ఆదేశించింది. ఆ తీర్పు వచ్చినప్పుడే ఎవరైనా హైకోర్టుకు వెళ్తే ఏపీ ప్రభుత్వానికి కూడా ఎదురు దెబ్బ తప్పని అనుకున్నారు. ఇప్పటికి ఓ జర్నలిస్ట్ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత ప్రభుత్వానికి మొట్టి కాయ పడుతుందా లేకపోతే.. తమ నిర్ణయం కరెక్టేనని సమర్థంగా వాదిస్తుదా అన్నదానిపై క్లారిటీ వస్తుంది.