తెలంగాణ సీఎం కేసీఆర్ పొలిటికల్ ప్లాన్లు వేస్తారు కానీ నేరుగా ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చే సరికి హరీష్ రావు లేదా కేటీఆర్కు బాధ్యతలు ఇస్తారు. కానీ ఇప్పుడు హుజురాబాద్ విషయంలో కేసీఆర్ అన్నీ స్వయంగా చూసుకుంటున్నారు. ఉంటే ప్రగతి భవన్ లేకపోతే ఫామ్ హౌస్ అన్నట్లుగా కేసీఆర్ వర్కింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు… రోజూ సమావేశాలు పెడుతున్నారు. ప్రజల్లోకి వెళ్తున్నారు. రానున్న రోజుల్లోనూ తిరిగేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఒక్క హుజూరాబాదే కాదు ప్రతి అంశంలోనూ నేరుగా కేసీఆరే కనిపిస్తున్నారు. కేసీఆర్ లో ఈ తాజా మార్పు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో గతంలో ఉన్నంత ఏకపక్ష వాతావరణం లేదు. ప్రతిపక్షాలు స్పీడయ్యాయి. ఏడాది కాలంగా బీజేపీ కొంత అగ్రెసివ్ గానే ఉంది. రెండు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడుగా నియమించింది. ఈ రెండు పార్టీలు దూకుడుగా ఉండటంతో కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇంట్లో కూర్చుంటే లాభం లేదన్న అభిప్రాయానికి కేసీఆర్ వచ్చారేమో కానీ రంగంలోకి దిగుతున్నారు. ఉరుములు లేని పిడుగుల్లా.. నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అంత అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం ఏమిటో కూడా చాలా మందికి అర్థం కాలేదు.
కానీ కేసీఆర్ లెక్కలు కేసీఆర్కు ఉంటాయంటున్నారు. కారణం ఏదైనా .. ప్రస్తుతం కేసీఆర్ మాత్రం తడిగుడ్డ వేసుకునేంత పరిస్థితి లేదని నమ్ముతున్నారు. అందుకే మూడో సారి గెలవాలంటే తప్పనిసరిగా తాను రంగంలోకి దిగాల్సిందేనని భావిస్తున్నారు. సహజంగా పదేళ్ల కాలం అధికార వ్యతిరేకత ఉంటుంది. అంత వ్యతిరేకతను తట్టుకుని గెలవడం అంత తేలిక కాదు. పైగా ఇప్పుడు ప్రారంభించిన పథకాలు గుదిబండగా మారే ప్రమాదం ఉందన్న అంచాలు ఎక్కువ అవుతున్నాయి. వాటిని ఇస్తామని నమ్మించడమే పెద్ద టాస్క్ అయిపోయింది. అందుకే తానే ఎదురుగా ఉండాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.