రాజకీయం అంటే మంచి చేసి ఓట్లు సంపాదించడం కాదు. చేస్తామని చెప్పి ఓట్లు సంపాదించడం. చేస్తారా లేదా అన్న సంగతి ఆ తర్వాత. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. ఆయన హజురాబాద్లో రూ. రెండు వేల కోట్ల వరకూ పెట్టుబడి పెట్టి.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలందరికీ ఆశ చూపి.. ఎన్నికల్లో ఓట్ల పంట పండించుకోబోతున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై కేసీఆర్ పార్టీ నేతలకు హింట్ ఇచ్చారు. ప్రతి పేద కుటుంబానికి “బంధు” పథకం వర్తింప చేస్తామని భరోసా ఇచ్చారు.
దళిత బంధు పథకం ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ నేతలకు ఆ పథకం సెగ తగిలింది. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తమకూ పథకం వస్తుంది కదా అని కొంత మంది మాట్లాడటం ప్రారంభించారు. మరికొంత మంది తమకు ఎప్పుడు ఇస్తారని ధర్నాలు ప్రారంభించారు. దళితులకు మాత్రమేనా మేము పేదలం కాదా అని ఇతర వర్గాలు రోడ్లపైకి వస్తున్నాయి. వీరందరికి పథకం వర్తింప చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అంటే వారు నమ్మాలి.. నమ్మి తీరాలి. మరోసారి ఓట్లు వేయాలి. ఓట్లు వేసిన తర్వాతనే మిగిలిన వర్గాలకు బంధు పథకం వస్తుందని కేసీఆర్ ఇప్పటికే పరోక్షంగా చెప్పారు.
దళిత బంధు ప్రారంభోత్సవ వేదిక మీద కేసీఆర్ ఒకటి రెండు నెలల్లో హుజురాబాద్లో దళిత బంధు అమలు పూర్తి చేస్తామన్నారు. మూడు , నాలుగేళ్లలో రాష్ట్రం మొత్తం అమలు చేస్తామన్నారు. అంటే.. ఒక్క దళిత బంధు అమలు చేయడానికే మూడు నాలుగేళ్ల పడుతుంది. కానీ రెండేళ్లలోనే ఎన్నికలు రానున్నాయి. ఈ లెక్కన చూస్తే ఎన్నికల్లోపు దళిత బంధు కూడా పూర్తిగా అమలు కాదు. ఆ విషయంపై ప్రజల్ని కూడా సన్నద్ధం చేస్తారు. ఎలాగూ సీఎం కేసీఆర్కు ముందస్తుకు వెళ్లే ఆలోచన ఉందన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఆయన ముందస్తుకు వెళ్తే.. ఇక బంధు ఒక్కటే ఎన్నికల హామీ.. టాపిక్ అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ మాస్టర్ ప్లాన్లు ఇలాగే ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నాయి.