స్పందన కార్యక్రమంపై అధికారులతో జరిపిన సమీక్షలో ముఖ్యమంత్రి మరోసారి మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. ప్రత్యేకంగా కొన్ని మీడియా సంస్థలను టార్గెట్ చేసి ఆయన వ్యాఖ్యలుచేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుండి ఆయన ఆయన పత్రికలు.. టీవీ చానళ్లపై లేని పోనివ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎంత అణగదొక్కగలరో అంతా అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఆర్థిక మూలాలు పెకిలించే ప్రయత్నాలు చేశారు. అయినా ఇప్పటికీ ఆయా మీడియా సంస్థలపై తన దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆడపిల్లలపై.. మహిళలపై ఏపీలో జరుగుతున్న దాడులగురించి మీడియా చెప్పడమే తప్పన్నట్లుగా సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
అది వారి కుటుంబాల గౌరవానికి భంగం కలిగిస్తుందన్నట్లుగా కొత్తగా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. నిజానికి రమ్య హత్య కు మీడియా అంత ప్రాధాన్యం ఇవ్వకపోతే న్యాయం జరిగి ఉండేదా..?. చాన్సే లేదు. మీడియా అంత ప్రాధాన్యం ఇచ్చింది కాబట్టే.. ఢిల్లీ నుంచి ఎస్సీ కమిషన్ కూడా వచ్చింది. లేకపోతే రమ్య.. రమ్య కుటుంబం అభాగ్యుల్లాగే ఉండిపోయవారు. ఇలాంటి వారు ఏపీలో ఎంత మంది ఉన్నారో లెక్క తీసి చెబితే సామాన్య జనం కూడా ఆశ్చర్యపోతారు. నేరస్తులకు భయం లేని పాలన ఏపీలో సాగుతోందని అందుకే విచ్చలవిడిగా నేరాలు పెరిగిపోతున్నాయని నిపుణుల ఆందోళలను సీఎం జగన్ కనీసం పరిశీలనలోకి తీసుకోవడం లేదు.
అదే సమయంలో లేని చట్టాన్ని ఉందని మభ్య పెట్టి .. ప్రజల్ని నమ్మించేందుకు చేస్తున్న ప్రయత్నంలో కొంత శాతం కూడా లా అండ్ ఆర్డర్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టలేని పరిస్థితి ఉంది. వీటన్నింటినీ కరెక్ట్ చేసుకోవాల్సిన ముఖ్యమంత్రి మీడియాపై నిందలేస్తూ టైం పాస్ చేస్తున్నారు. బాకా ఊదే మీడియా.. సూపర్ ఎడిటర్‌గా ఉంటూ చెప్పినట్లుగా ప్రసారాలు చేయించుకునే వెసులు బాటు ఇచ్చిన మీడియాలు మాత్రమే ఉంటే ఎవరైనా పాలన చేయగలరు. అసలైన ప్రతిపక్షంగా వ్యవహరించేదే మీడియా.
సాక్షి మీడియా ఎలా వ్యవహరించిందో అందరూ చూశారు . ఇప్పుడు ఎలా వ్యవహరిస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు. అలాంటి మీడియానే జనం సహించారు. సాక్షి మీడియాలో వచ్చిన కథనాలు ఎంత ఫేకో ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతోనే తేలిపోతుంది. ఒకప్పుడు తప్పు అని పుంఖాను పుంఖాలుగా రాసిన వాటినే ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తోంది. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు సీఎంగా జగన్‌కు ఎందుకు వస్తుందో కానీ ఆయన మాటల్లో మహిళలపై దాడులు జరగడం కన్నా వాటిని ప్రజలకు చెబుతున్న మీడియా వల్లే ఎక్కువ బాధపడుతున్నట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.