నాలుగేళ్ల క్రితం నాటి కేసు.. అదీ కూడా తెలంగాణ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చిన కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నుంచి సినీ ప్రముఖులకు నోటీసులు అందడం సంచలనాత్మకం అయింది. అసలు డ్రగ్స్ కేసును ఈడీ ఎలా తీసుకుంటుందన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. అయితే డ్రగ్స్ వాడకం.. రవాణా.. ఇలాంటి విషయాల్లో ఈడీ దర్యాప్తు చేయదు. కానీ వాటి కొనుగోలు , అమ్మకాల వ్యవహారాల్లో జరిగే నగదు లావాదేవీలు అక్రమం. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతం ఈడీ కూడా అక్రమ నగదు చెలామణి కోణంలోనే దర్యాప్తు చేస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా గత డ్రగ్స్ కేసును విచారించిన సిట్ చీఫ్ అకున్ సభర్వాల్‌ను కడా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన వద్ద మరిన్ని వివరాలు తీసుకోనున్నారు.
డ్రగ్స్ కేసు టాలీవుడ్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ కేసులో టాలీవుడ్ ఇక చిక్కుకుపోయినట్లేనన్న అభిప్రాయం వినిపించిన దశలో సెలబ్రిటీల శాంపిల్స్ సేకరించిన తర్వాత పోలీసులు సైలెంటయిపోయారు. చివరికి ఆ కేసును పక్కన పెట్టేశారు. ఎప్పుడైనా కోర్టుల నుంచి ఒత్తిడి వస్తే చార్జిషీట్లు వేయడం వంటివి చేస్తున్నారు. ఇటీవల వేసిన చార్జిషీట్లో ఒక్కరంటే ఒక్క సినీ ప్రముఖుడికీ డ్రగ్స్ దందాలో ప్రమేయం ఉందని చెప్పలేదు. అప్పుడే విమర్శలు వచ్చాయి. అయితే అదే సమయంలో ముంబైతో పాటు కర్ణాటకలోనూ ఈ మత్తు మందుల వ్యవహారం కలకలం రేపింది. అప్పుడే టాలీవుడ్ డ్రగ్స్ కేసు కూడా ఈడీకి వెళ్తుందని అనుకున్నారు. కానీ కాస్త ఆలస్యం అయింది.
ఇప్పుడు ఈడీకి ఎవరు సమాచారం ఇచ్చారన్నది కీలకంగా మారింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాలుగేళ్ల కిందటి నుంచి ఈ కేసు విషయంపై పోరాడుతున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు రాష్ట్రపతికే ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసి న్యాయపోరాటం చేస్తున్నారు. ఆయన వైపు నుంచి ఈడీకి ఫిర్యాదులు వెళ్లాయా..? అన్న చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో అసలు తెలంగాణ పోలీసులు వారికి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఏ ఆధారాలతో వారికి ఈడీ నోటీసులు జారీ చేసిందనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు డ్రగ్స్ విషయంలో ప్రమేయం లేదని దర్యాప్తు నివేదిక తేల్చినప్పుడు… మనీలాండరింగ్ అనే ప్రశ్నే ఎలా వస్తుందని కొంత మంది అనుమానం.
అయితే టాలీవుడ్ డ్రగ్స్ కేసు వెనుక ఏదో జరుగుతోందన్న అభిప్రాయం మాత్రం.. సినీ పెద్దల్లో ఉంది. అదేమిటో కొంత మందికి తెలుసు. చాలా మందికి తెలియదు. ఎవరు టార్గెట్ అయ్యారో.. ఎవరు టార్గెట్ చేస్తున్నారో.. విచారణ ప్రారంభమైన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.