`ఓ కథ ఉంది… వింటావా` అని విజయ్ దేవరకొండని అడిగితే… మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా?
`ఇది పాన్ ఇండియా కథనా.. కాదా` అని.
పాన్ ఇండియా కథైతేనే విజయ్ దేవరకొండ వింటున్నాడట. లేదంటే లేదు. ఇదో ఇప్పుడు నవ దర్శకుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. `లైగర్`తో తొలిసారి పాన్ ఇండియా కథని చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక మీద నుంచి కూడా పాన్ ఇండియా స్థాయి సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నాడట. అందుకే… చిన్న చిన్న (మన భాషకే పరిమితమైన) కథల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని సమాచారం.
ఇది వరకు శివ నిర్వాణతో ఓ సినిమా చేయడానికి విజయ్ ఓకే చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు సైతం సందిగ్థంలో పడింది. దానికి కారణం… శివ చెప్పిన కథ పాన్ ఇండియా కథ కాకపోవడమే. శివ కథలన్నీ మిడిల్ క్లాస్ నేపథ్యంలో సాగుతాయి. తెలుగువారి జీవితం ఉట్టిపడేలా ఉంటాయి. నిన్ను కోరి, మజిలీ.. అలాంటి కథలే. టక్ జగదీష్ కూడా అంతే. ఇదే జోనర్ లో…. ఓ అందమైన ప్రేమకథని తయారుచేసుకున్నాడట శివ. అయితే.. దాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దలేమని గ్రహించిన విజయ్… ఇప్పుడు ఆ కథని పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయి కథ చెబితే ఓకే. లేదంటే… శివ మరో హీరోని వెదుక్కోవాల్సిందే. తెలుగులో విజయ్ కి గొప్ప ఫాలోయింగ్ ఉంది. మిగిలిన భాషల్లోనూ ఇంతే జోరు చూపిస్తాడా, లేదా? అనేది `లైగర్` విడుదలైతే గానీ అర్థం కాదు. అయితే.. ఈ సినిమా విడుదలకు ముందే.. పాన్ ఇండియాకథలకు ఫిక్సయిపోయాడంటే.. అది లైగర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనుకోవొచ్చు. కాకపోతే.. ప్రతీసారీ పాన్ ఇండియా కథలుకావాలంటే కుదరదు. ఈ విషయాన్ని ఈ రౌడీ ఎప్పుడు గ్రహిస్తాడో?