యువ హీరోలంతా స్పీడు స్పీడుగా ఉన్నారు. ఒకేసారి రెండు మూడు సినిమాల్ని పూర్తి చేస్తున్నారు. ఓ యూత్ హీరోని పట్టుకోవాలంటే దర్శక నిర్మాతలకు గగనం అయిపోతోంది. యూత్ హీరోలేం ఖర్మ. సీరియర్లదీ అదే స్పీడు. చిరంజీవినే చూడండి. ఒకేసారి నాలుగు ప్రాజెక్టులు ప్రకటించి ఈతరానికి సవాల్ విసిరాడు. మరి.. యంగ్ తరంగ్ ఇంకెంత స్పీడుగా ఉండాలి.యూత్ అంతా అలానే ఉంది. ఒక్క నిఖిల్ తప్ప.
2018లో నిఖిల్ నుంచి కిరాక్ పార్టీ వచ్చింది. ఆ తరవాత.. ఇంకో సినిమా లేదు. `అర్జున్ సురవరం` రిలీజ్ అయినా.. అది రెండేళ్లు ఆగిపోయి, బయటకు వచ్చిన సినిమా. కిరాక్ పార్టీ కంటే ముందు చేసిన సినిమా. విడుదలలో జాప్యం జరిగింది. అంటే… దాదాపు మూడేళ్ల నుంచి నిఖిల్ నుంచి సినిమా లేదన్నమాట. `18 పేజీస్` అనే సినిమా చేస్తున్నాడు. కుమారి 21 ఎఫ్ తో ఆకట్టుకున్న ప్రతాప్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ లో చాలా జాప్యం జరిగింది. నిజానికి ఈ ఆలస్యానికి నిఖిల్ కారణం కాదు. కానీ ఆ ప్రభావం నిఖిల్ కెరీర్ పై పడుతోంది. 18 పేజీస్ రిలీజ్ అయి, ఆ సినిమా రిజల్ట్ తేలే వరకూ మరో సినిమా ఒప్పుకోకూడదనుకుంటున్నాడు నిఖిల్. అయితే ఆ 18 పేజీలే ఇంకా పూర్తి కావడం లేదు. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా, రీషూట్ల వల్ల జాప్యం జరుగుతోందని, అందుకే… ఆలస్యం అవుతోందని టాక్.