యువ హీరోలంతా తమ ఫిజిక్ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు. జిమ్ లో రాత్రీ పగలూ కష్టపడుతున్నారు. సిక్స్ప్యాకులు చేస్తున్నారు. అందరి కష్టం ఒక ఎత్తు… సుధీర్ బాబు కష్టం మరో ఎత్తు. తనకు ఫిట్ నెస్ పై ఇంకాస్త ప్రేమ ఎక్కువ. అందుకే అందరూ సుధీర్ బాబు కండల గురించి మాట్లాడుతుంటారు. అయితే.. ప్రతీసారీ తనని ఆకోణంలో చూడడం చిరాగ్గా ఉందని… తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు సుధీర్ బాబు. `కండల గురించి మాట్లాడడం బాగానే ఉంటుంది.. కాస్త నా పెర్ఫార్మ్సెన్స్ గురించి కూడా మాట్లాడితే ఆనందిస్తా` అంటున్నాడు సుధీర్ బాబు.
”హీరో అంటే ఇలా ఉండాలి.. అని మైండ్ లో ఫిక్సయిపోయా. ఆ లుక్ కోసం అందుకే కష్టపడుతుంటా. అయితే అందరూ కేవలం దానికోసమే మాట్లాడడం ఇబ్బంది గా ఉంది. అందుకే ఈసారి.. ప్రెస్ పీట్ పెట్టి.. ‘నేను బొజ్జ పెంచుతున్నా’ అని ప్రకటిస్తా. కనీసం అప్పుడైనా నా నటన గురించి మాట్లాడతారేమో` అంటున్నాడు సుధీర్ బాబు. తను నటించిన శ్రీదేవి సోడా సెంటర్ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సినిమాలో లైటింగ్ సూరిబాబుగా కనిపించబోతున్నాడు. `శ్రీదేవి..`పై చాలా ఆశలు పెట్టుకున్నాడు సుధీర్ బాబు. ”రియలిస్టిక్ సినిమాలంటే… మలయాళ చిత్రాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఈసినిమా తరవాత.. తెలుగు సినిమా గురించి కూడా చెప్పుకుంటారు” అని ధీమా వ్యక్తం చేశాడు సుధీర్.