ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల్ని ఆకర్షించడం లేదనే విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి కానీ.. గత రెండున్నరేళ్ల కాలంలో కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పదుల సంఖ్య పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. తాజాగా సెంచురీ ప్లై బద్వేల్‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ప్లైవుడ్, బ్లాక్ బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్, పార్టికల్ బోర్డ్‌ల తయారీలో దేశంలోనే అత్యంత పెద్ద పరిశ్రమగా గుర్తింపు పొందిన సెంచురీప్లై బద్వేల్‌లో మూడు దశల్లో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తొలి దశ పనులను తక్షణం ప్రారంభించి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రిని కలిసి తమ పెట్టుబడి ప్రతిపాదనలు వివరించారు.
కడప జిల్లాలో భారీ ఎత్తున ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఎస్సార్ స్టీల్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఇక కోప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ ను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. డిక్సన్ కంపెనీతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. డిక్సన్ సంస్థ ప్రధానంగా టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్, కెమెరా తదితర వస్తువులను తయారు చేస్తుంది. ఫర్నీచర్ తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న నీల్‌కమల్ సంస్థ, విద్యుత్తు మోటార్ల తయారీ రంగంలో పేరొందిన పిట్టి ఇంజినీరింగ్ సొల్యూషన్ సంస్థ కూడా ఇ కొప్పర్తిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. సరకు ఉత్పత్తులను తరలించే కాంకోర్ సంస్థకు చెందిన రైలు వ్యాగన్లు తయారు చేసే సంస్థ ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం తెలిసింది.
కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్న మెగా పారిశ్రామిక పార్కులో పెట్టుబడి పెట్టే సంస్థలకు ప్రత్యేక రాయితీలను ప్రభుత్వం ఇస్తోంది. పులివెందులలో ప్రఖ్యాత లెదర్ కంపెనీ అపాచీ ఇంటిలిజెంట్ ఎస్‌ఈజెడ్ కు శంకుస్థాపన చేశారు. ఐజీవై ఇమ్యూనోలాజికల్స్ సంస్థ కూడా ఏపీ కార్ల్‌తో ఒప్పందం చేసుకుంది. కడప జిల్లాలో ప్రకటనలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అవన్నీ గ్రౌండింగ్ అయితే కడప జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లా అవుతుంది. కానీ ఎప్పుడు అవన్నీ పెట్టుబడులుగా మారుతాయన్నదే సస్పెన్స్.