కరోనా చాలా కథలు నడిపింది. లాక్ డౌన్‌లో ఎన్నో చేదు అనుభవాలు. ఇప్పుడు తలచుకుంటే – తమాషాగా అనిపిస్తుంది గానీ, అవన్నీ ప్రపంచానికి చీకటి రోజులు. ఎక్కడ ఎలాంటి అనుభవాన్నయినా, సినిమాటిక్ గా మలచుకోవడం, సినిమా కథలకు అనువుగా మార్చుకోవడం తెలుగు చిత్రసీమకు `రీలు`తో పెట్టిన విద్య. అందుకే.. లాక్ డౌన్, కరోనా కష్టాలు కూడా కథలుగా మారిపోయాయి. అలాంటి ఓ కథ `వివాహ భోజనంబు`. హాస్య నటుడు సత్య హీరో అవ్వడం – సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరించడం, క్రేజీ టైటిల్.. దానికి తోడు కరోనా కథ. వెరిసి ఈ సినిమా ఎలా ఉంటుందా? అనే ఉత్సుకత మొదలైంది. సోనీ లైవ్ లో – ఈరోజు నుంచి (ఆగస్టు 27) నుంచి స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది? కరోనా కష్టాల్ని ఎంత ఫన్నీగా చెప్పారు? తెలుసుకుంటే..
మహేష్ (సత్య) ఎల్.ఐ.సీ ఏజెంట్ గా పని చేస్తుంటాడు. పరమ పిసినారి. తనని అనిత (ఆర్జావీ రాజ్) ప్రేమిస్తుంది. అనిత తండ్రి రాధాకృష్ణ (శ్రీకాంత్ అయ్యంగార్)కి మహేష్ అంటే నచ్చదు. తన పేదరికం, పిసినారి బుద్ధులంటే అస్సలు పడదు. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలనుకుంటాడు. కానీ… జరిగిపోతుంది. సంప్రదాయ బద్ధంగా పెళ్లి కూతురి ఇంట్లో జరగాల్సిన పెళ్లి.. `తమ కుటుంబ ఆచారం` అంటూ.. మహేష్ ఇంట్లో నిర్వహిస్తారు. అయితే… మోడీ లాక్ డౌన్ ప్రకటించడంతో అనిత ఇంట్లో వాళ్లంతా.. సత్య ఇంట్లోనే ఉండిపోవాల్సివస్తుంది. ఈ కుటుంబాన్ని లాక్ డౌన్ సమయంలో పోషించడానికి పిసినారి మహేష్.. ఎంత కష్టపడ్డాడు? వాళ్లని తరిమేయడానికి ఎన్ని పాట్లు పడ్డాడు? అనేదే మిగిలిన కథ.
లాక్ డౌన్ కష్టాల కథ ఇది. ఇలాంటి ఘటనలు.. నిజంగా జరిగాయి కూడా. పెళ్లికని వచ్చి – ఓ ఇంట్లో ఇరుక్కుపోయిన కుటుంబాల కథలు చాలానే విన్నాం.. చూశాం. ఇప్పుడు అలాంటి ఓ కథని తెరపైకి తీసుకొచ్చారంతే. పదిమంది ఉన్న ఓ కుటుంబం.. పిసినారి ఇంట్లో తిష్ట వేస్తే.. ఏం జరుగుతుందో ఈ సినిమాలో చూపించారు. లాక్ డౌన్ సమయంలో.. `ఆశీర్వాద్ మైదా పిండి` లాంటి తమాషా సంఘటనలు చాలా జరిగాయి. వాటిని సినిమాలో యదేచ్ఛంగా వాడుకున్నారు. దీపాలు వెలిగించండి అని మోడీ పిలుపునిస్తే.. ఏకంగా దీపావళి చేసేసుకోవడం, చప్పట్లు కొట్టమంటే ప్లేటులు పగలకొట్టేయడం ఇవన్నీ ఈ సినిమాలో సన్నివేశాలుగా మారిపోయాయి. ఇప్పటికీ కరోనా బాధలు పోలేదు కాబట్టి… ఆ జ్ఞాపకాలన్నీ ఇంకా ఫ్రెష్ గానే కనిపిస్తాయి.
అయితే.. ఇలాంటి కథల్లో ఉన్న చిక్కు ఒక్కటే. జరిగిపోయిన సంగతులే తెరపై చూపించడం వల్ల కొత్తగా ఏం అనిపించదు. మాస్కులు, శానిటైజర్లు, రాపిడ్ టెస్టులు, డాక్టర్ల హడావుడీ.. ఇవన్నీ చూసీ చూసీ విసిగిపోయాం. తెరపైనా అదే కనిపిస్తే భరించడం కష్టమే అవుతుంది. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. సత్యది పిసినారి పాత్ర. తెరపై కోట శ్రీనివాసరావు (అహనా పెళ్లంట, ఆమె) పిసినారి తనం చూశాక… ఇంకెవరు అలాంటి పాత్ర చేసినా కంటికి ఆనదు. కేవలం సత్య ఎక్స్‌ప్రెషన్స్ వల్లే… కొన్ని సన్నివేశాల్లో నవ్వుకోగలుగుతాం. అంతే తప్ప.. ఆయా సన్నివేశాల్లో చొప్పించిన కామెడీ కోసం కాదు.
దానికి తోడు.. సందీప్ కిషన్ ఈ సినిమాని ఆక్రమించుకోవడానికి తన వంతు శ్రమ తాను చేశాడు. నిర్మాత కాబట్టి, తనలోనూ ఓ నటుడు ఉన్నాడు కాబట్టి… అతిథి పాత్ర చేసి వెళ్లిపోదాం అనుకోవడంలో తప్పు లేదు. కానీ సందీప్ కిషన్ కోసం ఆ పాత్రని సాగదీసినట్టు అనిపిస్తుంది. దాంతో తను వచ్చి లేని పోని హడావుడి చేశాడు. సందీప్ వల్ల ఈ సినిమాకి ఒనగూరిందేం లేదు. కొన్ని సన్నివేశాల్లో `లాగ్` ఫీలింగ్ ఇవ్వడం తప్ప.
అంత అందమైన అమ్మాయి మహేష్ కి ఎలా పడిపోయిందన్న క్వశ్చన్ అందరిలోనూ ఉంటుంది. దాన్ని తెరపై చూపించకపోతేనే బాగుండేది. చూపించి.. ఆ ఉత్సుకతనీ పొగొట్టేశారు. మహేష్ – అనితల లవ్ స్టోరీ సైతం బోర్ కొట్టించేలానే సాగింది. ప్రతీ పిసినారికీ ఓ కథ ఉన్నట్టు… మహేష్ కీ ఉంటుంది. చివర్లో తాను దాచుకున్న డబ్బుని ఓ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇచ్చేయడం – దాంతో మనసుల్ని గెలుచుకోవడం ఇవన్నీ రొటీన్ ఫార్ములా ట్రిక్కులే. రెండు గంటల నిడివి ఉన్నకథ ఇది. సత్య పిసినారి తనం.. దాన్ని భరించలేని శ్రీకాంత్ అయ్యంగార్ విన్యాసాలూ, ఫస్ట్రేషన్ – సినిమా అంతా ఇదే. దాంతో.. ఎక్కడ పాజ్ చేసి, ఎక్కడ ఫార్వర్డ్ చేసి చూసినా…. ఒక్కటే సీన్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది.
సత్యది హీరో ఫేసు కాదు. ఈ పాత్ర కూడా హీరో చేయాల్సింది కాదు కాబట్టి.. సత్యకు యాప్ట్ అయిపోయింది.చాలా సన్నివేశాలు కేవలం సత్య ఎక్స్‌ప్రెషన్స్ వల్ల నడిచిపోయాయి. ఇలాంటి కథలకు సత్యని ఓ ఆష్షన్ గా అనుకోవొచ్చు. ఇక అనిత గా కనిపించిన ఆర్జావీ రాజ్… బొమ్మలా నిలుచుకున్నప్పుడే బాగుంది.నోరు తెరచి డైలాగ్ చెప్పాలనుకున్నప్పుడు దొరికిపోయేది. శ్రీకాంత్ అయ్యంగార్.. కొన్నిసార్లు ఓవర్ యాక్షన్ చేశాడు. సత్య తరవాత కామెడీ బాధ్యత మోసింది సుదర్శనే.
ఈ సినిమాలో హీరో పిసినారి అయితే…. నిర్మాత సందీప్ కిషన్ మరింత పిసినారితనం చూపించాడు. చాలా తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాని పూర్తి చేయడం ధ్యేయంగా పెట్టుకున్నాడు. నిర్మాణ విలువలేం కనిపించవు. పనిలో పనిగా.. తన రెస్టారెంట్ `వివాహ భోజనంబు`కి కావల్సినంత పబ్లిసిటీ ఇచ్చాడు. రెండు పాటలున్నాయి. కానీ గుర్తుండవు. లాక్ డౌన్ కష్టాల కథలు.. ఒకట్రెండు ఎపిసోడ్ల వరకూ చూపించడానికి ఓకే. సినిమాగా మార్చాలి అనుకుంటే… సన్నివేశాల్ని సాగదీయాలి. ఇక్కడ అదే జరిగింది. దాంతో.. బోర్ కొట్టింది.