వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించింది. విశాఖను ఎలా అభివృద్ధి చేయాలో విదేశాలకు వెళ్లి పరిశీలిస్తానని ఆయన సీబీఐ కోర్టులో దరఖాస్తు చేశారు. విశాఖలో చాలా తీర ప్రాంతం ఉందని… ఆ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే… అలాంటి తీర ప్రాంతాలే ఉన్న దేశాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలించాల్సి ఉందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన సీబీఐ కోర్టు అక్టోబర్‌లోపు రెండు వారాల పాటు విదేశీ పర్యటన చేయడానికి అంగీకరించింది. దుబాయ్, ఇండొనేషియాలోని బాలి, మాల్దీవ్స్ వెళ్లడానికి ఆయనకు పర్మిషన్ వచ్చింది. ఎప్పుడు వెళ్తారో క్లారిటీ లేదు.
విజయసాయిరెడ్డికి విశాఖతో అధికారికంగా ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఓ రాజ్యసభ ఎంపీ మాత్రమే. విశాఖకు ఎంపీ కాదు. అదే సమయంలో ప్రభుత్వ పరంగా కూడా అధికారికంగా ఆయనకు ఎలాంటి బాధ్యతలు లేవు. కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తరాంధ్రకు ఇంచార్జ్‌గా ఉన్నారు. అది పార్టీ పదవి పార్టీ వ్యవహారాలను మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆయనకు సీఎం వద్ద ఉన్న పలుకుబడి ఆధారంగా మొత్తం ఉత్తరాంధ్ర సీఎంను అన్నట్లుగా ఆయన చెలామణి అయిపోతున్నారు. సమీక్షా సమావేశాలు పెడతారు. అధికారిక నిర్ణయాలూ వెల్లడిస్తూ ఉంటారు. ఇప్పుడు విశాఖ అభివృద్ధి కోసం అంటూ కోర్టుకే చెప్పి పర్మిషన్ కూడా తీసుకున్నారు.
అయితే విజయసాయిరెడ్డి పర్యటనలపై రకరకాల అభిప్రాయాలు వినిపించే అవకాశం ఉంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ-2 నిందితుడైన ఆయన విదేశాల నుంచి సూట్‌కేసు కంపెనీల పేరుతో మనీలాండరింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించారన్న అభియోగాలున్నాయి. గతంలో ఇలాగే సెర్బియాకు వెళ్లిన మరో నిందితుడు నిమ్మగడ్డను రస్ అల్ ఖైమా ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు. ఏడాది తర్వాత వదిలి పెట్టారు. దుబాయ్ వెళ్తే విజయసాయిరెడ్డికీ అదే పరస్థితి అన్న ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యవహారాలను సెటిల్ చేయడానికే ఆయన గల్ఫ్ వెళ్తున్నార్నన అభిప్రాయం కూడా వినిపిస్తోంది.