కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ పార్టీలో మరో చర్చలకు తెర తీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా ప్రయత్నిస్తానని ఆయన ప్రకటించి కలకలం రేపారు. దళిత బంధు విషయంలో కేసీఆర్‌ను విమర్శించినట్లుగా విమర్శించి సొంత పార్టీలో ఆయన కలకలం రేపే మాటలు మాట్లడటంతో రేవంత్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ప్రారంభమయింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో హుషారు వచ్చింది. అందరూ యాక్టివ్ అయిపోయారు. కాంగ్రెస్ మునుపెన్నడూ లేని విధంగా సవాల్ విసురుతోందని టీఆర్ఎస్‌కూ అర్థమైపోయింది.
నిన్నటి వరకూ రేవంత్ పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ మరింత దిగజారిపోతుదంన్నట్లుగా మాట్లాడిన కోమటిరెడ్డి ఇప్పుడు గెలిపు గురించి .. గెలిస్తే ముఖ్యమమంత్రి పదవి గురించి మాట్లాడుతున్నారు.కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రోత్సాహకర ఫలితాలు వచ్చినా ఆ క్రెడిట్ పూర్తిగా రేవంత్ రెడ్డికే వస్తుందనడంలో ప్రత్యేకంగా సందేహం లేదు. నిజంగానే రేవంత్ రెడ్డి చెబుతున్నట్లుగా వచ్చే ఎన్నికల్లో 72 సీట్లు సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి పదవి రేసులో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
హైకమాండ్ కూడా ఆయన వైపే మొగ్గుతుంది. అది సహజం. తనకు ఇమ్మంటే ఇవ్వరు కాబట్టి కనీసం రేవంత్ ను అయినా ఇరుకున పెట్టడానికి దళిత ముఖ్యమంత్రి వాదనను కోమటిరెడ్డి తెరపైకి తెచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారం కోసం కాంగ్రెస్ పోటీపడే స్థితికి చేరిందని కోమటిరెడ్డి అంగీకరించారని రేవంత్ వర్గీయులు అంటున్నారు.