జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ను సీబీఐ కోర్టు కొట్టి వేసిందంటూ సాక్షి మీడియా చేసిన ప్రచారంపై కోర్టులో పిటిషన్ వేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు నిర్ణయించుకున్నారు. కోర్టులు తీర్పులు చెప్పకుండానే సాక్షి మీడియాకు ఎలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. దీని వెనుక కుట్ర ఉందని తక్షణం విచారణ జరిపించాలని కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. ఈ అంశంపై గురువారం కూడా మాట్లాడారు. న్యాయమూర్తి దృష్టికి తీర్పు ప్రకటించిన అంశాన్ని తీసుకెళ్లానని చెప్పారు. ఈ రోజు పిటిషన్ దాఖలు చేస్తానని చెప్పడం వైసీపీ వర్గాలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ఆయన దాఖలు చేసిన పిటిషన్లు వైసీపీ నేతలకు లేని పోని టెన్షన్లు తెచ్చి పెడుతున్నాయి.
విదేశాలకు వెళ్తున్న విజయసాయిరెడ్డి మళ్లీ తిరిగి వస్తారో లేదోనన్న అనుమానాలను రఘురామకృష్ణరాజు వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ నేతలు, జగన్ మీడియా రఘురామ కృష్ణరాజు విజయ్ మాల్యాలా విదేశాలకు పారిపోతున్నారని ప్రచారం చేశారు. ఈ కారణంగా ఆయన గతంలో విదేశీ పర్యటనను కూడారద్దు చేసుకున్నారు. గతంలో తాను విదేశాలకు పారిపోతానని ప్రచారం చేశారని ఇప్పుడు ఎవరు విదేశాలకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి మళ్లీ తిరిగి వస్తారా అనే అనుమానం వ్యక్తం చేస్తూ… వారి మనసులో ఉన్న విషయాలను అందరికీ ఆపాదిస్తున్నారని విమర్శించారు.
విశాఖపట్నంలో తీర ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయాలో విదేశాల్లో పరిశీలించి వస్తాననిచెప్పి విదేశీ పర్యటనకు విజయసాయిరెడ్డి అనుమతి తీసుకోవడంపై వైఎస్ఆర్ అనుమానం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతివ్వడం సమంజసం కాదన్నారు. తీరప్రాంతాల్లో అధ్యయనానికి వెళ్తున్నానని విజయసాయి చెప్పారని.. విశాఖ తీర ప్రాంతం ఎంతవరకు బాగుపడుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. గతంలో తనపై చేసిన ప్రచారానికి ఇప్పుడు కౌంటర్లు ఇస్తూ విజయసాయిరెడ్డి మళ్లీ తిరిగి రారనే అర్థంలో రఘురామ ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది.