తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఆయనలో చంద్రబాబునే చూడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా డిసైడయినట్లుగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవైయ్యేళ్లు అవుతున్న సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసే సమావేశం నిర్వహించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై చంద్రబాబు ముద్ర వేయడానికే ప్రయత్నించారు. రేవంత్ రెడ్డి ఎవరి మనిషిగా ఇక్కడ మాట్లాడుతున్నారో కూడా అందరికీ తెలుసుని..ఆ చిలక మనదే.. పలుకు పరాయిదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ఫ్రాంఛైజీ లాగా తీసేసుకుని రేవంత్‌ను అధ్యక్షుడిగా చేశారని.. చంద్రబాబు ఆడించే తోలుబొమ్మలాటలో ఒక బొమ్మ అంతేనని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శల ధాటికి టీఆర్ఎస్ నేతలు వరుస కట్టి రేవంత్ పై ఎటాక్ చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన భాషను కేటీఆర్ సమర్థించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పటి వరకూ ఎంతో సహనంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. గజ్వేల్‌లో దళిత, గిరిజన దండోరా సభపై రేవంత్ ఇటీవల ఎక్కువగా మాట్లాడుతున్నారు. అక్కడ సభ పెడితే అడ్డుకుంటామని కొంత మంది టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు.
తొక్కుకుంటూ పోతామని రేవంత్ హెచ్చరించారు. గజ్వేల్ సభ అంత లొల్లి ఎందుకు చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. మల్లారెడ్డి సవాల్ చేసినట్లుగా రాజీనామా చేస్తే అక్కడే చూసుకందామన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క వెళ్లి చంద్రబాబుకు రాఖీ కట్టారు. ఆ అంశంపైనా టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. దానికి సీతక మేడ్చల్ కాంగ్రెస్ సభలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌ను సీఎం చేస్తే ఊరుకునేది లేదని కవిత అమెరికా వెళ్లిపోయారని వారి మధ్య అనుబంధాల్లాంటివేమీ లేవని.. కానీ తమకు పార్టీలకు అతీతంగా అనుబంధాలు ఉంటాయని కౌంటర్ ఇచ్చారు. వీలైనప్పుడల్లా.. కాంగ్రెస్ పార్టీ నేతలను చంద్రబాబుకు లింక్ పెట్టాలని టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. చివరికి కేటీఆర్ కూడా రేవంత్‌లో చంద్రబాబునే చూస్తున్నారు.