తెలంగాణ ప్రభుత్వం అసహనానికి గురవుతోంది. విమర్శించిన వారిని అధికార బలం ఉపయోగించి అరెస్ట్ చేసేందుకు కూడా వెనుకాడని పరిస్థితులు ఏర్పడిన సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని టీవీ చానళ్లలో కార్యక్రమాలు నిర్వహించి.. సొంతంగా క్యూ న్యూస్ అనే యూట్యూబ్ చానల్‌ను నడుపుతున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను పోలీసులు అర్థరాత్రి అరెస్ట్ చేశారు. గతంలో ఓ వ్యక్తిని డబ్బుల కోసం బెదిరించినట్లుగా ఫిర్యాదు వచ్చిందని ఆ ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు మీడియాకు సమాచారం పంపారు.
కొద్ది రోజులుగా తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీసులపై పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. ఆయనపై రకరకాల ఫిర్యాదులు చేసేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఫిర్యాదు వచ్చినప్పుడల్లా ఆఫీసుపై దాడి చేసి హార్డ్ డిస్క్‌లు తీసుకుపోతున్నారు. రెండు రోజుల కిందట కూడా పెద్ద ఎత్తున హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అయినా ఆయన క్యూ న్యూస్ ప్రసారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తన ఇంటిపైకి పోలీసుల్ని పంపి భార్య, పిల్లల్ని భయపెట్టే ప్రయత్నం చేశారని ఓ సీసీ టీవీ వీడియోలను మల్లన్న ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
తీన్మార్ మల్లన్న రాజకీయ లక్ష్యాలున్న వ్యక్తి. ఆయన సొంతగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాంను సైతం అధిగమించి రెండో స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన తెలంగాణ వ్యాప్తంగా తనకుంటూ ప్రత్యేకమైన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం పెంచుకున్నట్లుగా కనిపిస్తోంది. ఉదయం టీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ మీడియా ముసుగులో కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నామని ఊరుకోబోమని హెచ్చరించారు. రాత్రికి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు.
విశేషం ఏమిటంటే.. మల్లన్నను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు వచ్చాయి. జోతిష్యం పేరుతో టీవీల్లో కనిపించే లక్ష్మికాంత శర్మ అనే వ్యక్తిపై పదిహేడు షోలు చేసి తప్పు చేశానని అందులో పేర్కొన్నారు. అయితే పోలీసు కస్టడీలో ఉన్న మల్లన్నకు ఫోన్ ఎందుకు ఇస్తారని.. ఆ ట్వీట్‌ను పోలీసులే చేశారని సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభమయ్యాయి. మొత్తానికి తీన్మార్ మల్లన్న అరెస్టు వేధింపులేనన్న ఓ అభిప్రాయం ప్రజల్లో బలపడే అవకాశం కనిపిస్తోంది.