తెలంగాణలో బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఆయన నడక లాంఛనంగా ప్రారంభమయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ తమ పార్టీ ఎజెండాను నేరుగానే చెప్పారు. భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెడుతుంటే బీజేపీ మతతత్వ పార్టీ అంటున్నారని .. ఖచ్చితంగా బీజేపీ మతతత్వ పార్టీనేనని బండి సంజయ్ తేల్చిచెప్పారు. కచ్చితంగా బీజేపీ హిందువుల కోసమే ఉందని.. హిందూ సమాజాన్ని ధర్మాన్ని కాపాడేందుకు బీజేపీ పని చేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రతి హిందువు గర్వంగా చెప్పుకొనే పరిస్థితి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.
భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రాకూడదా అని మండిపడ్డారు. భాగ్యలక్ష్మి ఆలయం మాది.. పాత బస్తీ మాది… తెలంగాణ మాది…అని బండి సంజయ్ ఆవేశ పడ్డారు. ఏ బస్తీకైనా, ఏగల్లీకైనా వెళ్తామని స్పష్టం చేశారు. తాలిబన్ భావజాలం ఉన్న ఎంఐఎం పార్టీని, దానికి సహకరిస్తున్న ఎవరినైనా ఈ తెలంగాణ నుంచి తరిమితరిమి కొట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు. తాలిబన్ భావజాలం ఉన్న తెలంగాణ కావాలా? బీజేపీ కావాలా? మీరే నిర్ణయించుకోమని ఆవేశంగా ప్రసంగించారు.
ప్రజా సంగ్రామ యాత్ర టీఆర్ఎస్ నియంత, అవినీతి, కుటుంబ పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకేనని స్పష్టం చేశారు.ఈ యాత్ర రాజకీయ ప్రకంపనలు రేపబోతోందన్నారు. తెలంగాణలో ఒకే కుటుంబం రాజ్యమేలుతోందని అమరవీరుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయన్నారు. రూ.లక్షల కోట్లను పూర్తిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఒవైసీ, కల్వకుంట్ల కుటుంబాలు రెండింటింకే ప్రజలు రాష్ట్రాన్ని దత్తత ఇచ్చారు. వారే ఇప్పుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగితే భవిష్యత్తులో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి వస్తుందిృన్నారు. బండి సంజయ్ పాదయాత్రకు కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ కూడా హాజరయ్యారు.దీంతో ఆయనకు కాస్త భరోసా లభించినట్లయింది.