పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని ఆయన కాలేజీలు ఉన్న భూములు, యూనివర్శిటీ అనుమతులు ఇతర అంశాలపై డాక్యుమెంట్లు బయట పెట్టి ఆరోపణలు చేశారు. కేసీఆర్.. మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలకు కౌంటర్‌గా మల్లారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టారు. కానీ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ అబద్దాలని చెప్పారు. రేవంత్ రెడ్డి తప్పుడు పత్రాలు చూపించి బ్లాక మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఏవో కాగితాలు తీసుకొచ్చి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దొంగ పత్రాలు చూపెట్టి తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. అన్ని అనుమతులతోనే ఆస్పత్రిని నిర్మించానని అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నాయన్నారు.
అయితే రేవంత్ రెడ్డి చెప్పిన భూముల్లోనే తన కాలేజీలు ఉన్నాయని అంగీకరించారు. ఆ భూముల రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా దక్కించుకున్నారా లేకపోతే.. అధికారికంగా ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేశారా అన్న విషయాలను మాత్రం స్పష్టం చేయలేదు. అయితే రేవంత్ రెడ్డిపై మాత్రం ప్రత్యారోపణలు చేశారు. తన కాలేజీల్ని మూసి వేయిస్తానని చాలా కాలంగా బెదిరిస్తున్నారని.. తప్పుడు పత్రాలతో ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో కూడా ప్రశ్నలు అడిగారని.. అన్ని కరెక్ట్‌గా ఉన్నాయని కేంద్రం సమాధానం చెప్పిందన్నారు.
తాను అమాయకుడ్నని.. రేవంత్ రెడ్డి ఓవర్ స్మార్ట్ అన్నారు. తనకు అంత రాజకీయం తెలియదని చెప్పుకొచ్చారు. తెలంగాణకు మహాత్ముడైన కేసీఆర్‌ను తిడితే ఉరుకుంటామా అని ప్రశ్నించారు. అదే సమయంలో తన కాలేజీలతో తాను సేవ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. జవహర్‌నగర్‌లో అన్నీ ప్రభుత్వ భూములే ఉన్నాయని .. పేద ప్రజల కోసం తాను ఆస్పత్రి కట్టానని చెప్పుకొచ్చారు. అంటే తన ఆస్పత్రి కూడా ప్రభుత్వ భూమిలోనే ఉందని ఆయన అంగీకరించినట్లయింది.
రేవంత్ రెడ్డి తప్పుడు పత్రాలు చూపించి ఆరోపణలు చేసినట్లయితే.. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ చర్యలు తీసుకోవడం క్షణాల్లో పని. రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తే మిగతా పని వారు పూర్తి చేస్తారు. కానీ మల్లారెడ్డి ఆ పత్రాలు తప్పుడువని చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. కానీ చర్యలు తీసుకుంటామని అనలేదు.