ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతంలో రాసే “కొత్తపలుకు”కు ఈ వారం కూడా ముడి సరుకును ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డే సమకూర్చారు. కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ఆయన మీడియాపై వ్యాఖ్యలు చేశారు. మీడియాపై యుద్ధం చేస్తున్నామని ప్రకటించారు. నిజానికి ఆ మాటలు కొత్తేమీ కాదు. కానీ మళ్లీ చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి మీడియా గురించి చెబితే ఆయన మీడియా గురించి చెప్పడానికి పేజీలు సరిపోవు. ముఖ్యంగా రాధాకృష్ణ అయితే చెలరేగిపోతారు. అదే చేశారు. తన “కొత్తపలుకు”లో 70 శాతం గతంలో ఏం చెప్పారు..? ఏం ప్రచారం చేశారు..? ఇప్పుడెందుకు ఉలిక్కి పడుతున్నారు.. ? అని ప్రశ్నించడానికే కేటాయించారు.
తనది తప్పు అన్న ప్రతి వ్యవస్థపై జగన్ దాడి చేస్తున్నారని.. ఇప్పటికి అన్ని వ్యవస్థలపైనా దాడి చేశారని.. ఇక మిగిలింది ప్రజలపైనేనని తేల్చారు. నిజానికి ప్రజలపై కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాడి చేస్తోందని ఆంధ్రజ్యోతిలో కథనాలు రాయడం ప్రారంభించి రెండేళ్లవుతోంది. వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో లేకపోతే తర్వాత వ్యహాత్మకంగా ఓట్లేసినా ప్రజలపైనా దాడి ప్రారంభించేశారని కథనాలు ప్రసారం చేస్తారో కానీ ఇప్పటికే ప్రజలపై జగన్ దాడి చేయడం లేదన్న అర్థంలో చెప్పుకొచ్చారు.
కేసీఆర్ గురించి కూడా ప్రస్తావించారు.కాకపోతే చాలా తక్కువ. ఆయనకు ఏదీ కలసి రావడం లేదని తేల్చారు. ఏం చేసినా మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోందన్నారు. దళిత బంధు గురించే ఈ మాటలు. హుజురాబాద్ లో పథకం అమలు చేసిన తర్వాత కేసీఆర్కు అసలు చిక్కులు ప్రారంభమవుతాయని విశ్లేషించారు. గతంలో కేసీఆర్ మాత్రమే నోటి దురుసుగా వ్యాఖ్యలు చేసేవారు… ఇతరులు చేయడానికి సాహసించేవారు కాదు కానీ ఇప్పుడు కేసీఆర్ను మించి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. తన ఆర్టికల్లో ఇద్దరు సీఎంలు కష్టాల్లో ఉన్నారని.. వారు బయటపడటం కష్టమన్న ఆనందం ఆర్కేలో కనిపించింది కానీ ఎందుకో ఆయనకు స్వరూపానందను ఇరికించాలని అనిపించింది. ఆయనను కూడా లాక్కొచ్చారు.
ఇద్దరు ముఖ్యమంత్రులను స్వరూపానందే కాపాడాలని సందర్భం లేకపోయినా రాసుకొచ్చారు. ఆర్కేకు స్వరూపానంద ఎందుకు గుర్తొచ్చారో కానీ ఇప్పుడు యాగాలు చేసి సీఎంలను వారి పీఠాలను కాపాడాల్సిన బాధ్యత స్వరూపానందపైనే ఉందని చెప్పుకొచ్చారు. ఆయన గతంలో యాగాలు చేసి వీరికి గెలుపులు ప్రసాదించానని చెప్పుకున్న మాటలను గుర్తు చేశారు. ఇద్దరు సీఎంలకు ఆత్మీయుడైన స్వామిజీని ..సీఎంలతో పాటు ఇబ్బందుల్లోకి నెట్టాలని అనుకున్నారో.. ఆయన మాటలు… యాగాలు ఉత్త గ్యాసేనని సీఎంలకు జ్ఞానోదయం చేయాలనుకున్నారో కానీ.. ఫినిషింగ్ టచ్ స్వరూపానందకే ఇచ్చారు.