రాజధాని అమరావతి ఉద్యమం 600 రోజులు దాటిపోయింది. అది అలా కొనసాగుతుంది. అప్పుడప్పుడూ ఆ ఉద్యమం వేడి మీద ఎండుగడ్డి వేసే ప్రకటనలు అధికార పార్టీ నేతలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా నిర్ణయించేసిన విశాఖలోనూ అలాంటి ఉద్యమం రోజుల తరబడి సాగుతోంది. అదే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం. ఉద్యోగులు ఇప్పటికి రెండు వందల రోజులుగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. వారి గోడు వారిదే కానీ వినిపించుకునేవారే లెకుండా పోయారు.
రెండు వందల రోజుల కిందట కేబినెట్ మీటింగ్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మాలని నిర్ణయం తీసుకున్నారన్న విషయం తెలిసిన తర్వాత ఉద్యోగులు రోడ్డెక్కారు. వారికి తోడుగా రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. స్టీల్ ప్లాంట్ చరిత్రను చెప్పి అందరిలోనూ భావోద్వేగాన్ని నింపే ప్రయత్నం చేశారు. కానీ ఏపీ ప్రజలు వాటిని ఎప్పుడో కోల్పోయారు. అందుకే ఆ తర్వాత ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగులకేగా..మనకేంటి అనుకోవడం ప్రారంభించారు. కార్పొరేషన్ ఎన్నికల వరకూ రాజకీయ పార్టీలు పట్టించుకున్నాయి. ఇప్పుడు వాళ్లు కూడా పట్టించుకోవడం లేదు. కేంద్రం శరవేగంగా అమ్మకం ప్రక్రియను చేపడుతోంది.
కానీ ఉద్యోగులు మాత్రం ప్రైవేటీకరణ అంటూ జరిగితే తమకు ఉండే హక్కులు అన్నీ పోతాయని భయపడుతున్నారు. వారు మాత్రం .. రోజూ దీక్షలు ధర్నాలు చేస్తున్నారు. రెండు వందల రోజుల ఉద్యమం సందర్భంగా భారీ మానవహారం నిర్మించారు. సంఘిభావం తెలియచేయడానికి వచ్చిన రాజకీయ నేతలపై వారికి కోపం తీవ్ర స్థాయిలో వచ్చింది. ఎంపీని అక్కడ్నుంచి వెళ్లిపోయేదాకా ఊరుకోలేదు. కానీ వారి ఆవేశం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కనీసం రాజధాని రైతులు న్యాయస్థానాల్లో అయినా పోరాడుతున్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఆ చాయిస్ కూడా లేదు. తమకు అధికారం ఉంది..అమ్ముతున్నాం అడగడానికి కోర్టుకు కూడా హక్కుల్లేవని కేంద్రం తేల్చేసింది.