బెంగాల్ రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తత ప్రారంభమయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి, ఆయన భార్య రుచిరా బెనర్జీకి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీన రుచిరా, ఆరో తేదీన అభిషేక్ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. బెంగాల్లో బొగ్గు స్కాం జరిగిందని దానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుల్లో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. అభిషేక్ బెనర్జీ దంపతులతో పాటు ఇద్దరు సీనియర్ అధికారులకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.
తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత అభిషేక్. మమత తరపున పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చక్క బెడుతూంటారు. బొగ్గు స్కాం గత ఎన్నికల సమయంలో రాజకీయ అంశం అయింది. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తమను వేధిస్తున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు. తాజా ఈడీ నోటీసులపైనా మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని తెగనమ్మేసిన బీజేపీ బొగ్గు కుంభకోణంలో తృణమూల్‌ను వేలెత్తి చూపించలేరని అంటున్నారు. దమ్ముంటే తమ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలని ఆమె సవాల్ విసిరారు. గుజరాత్ చర్రిత ఏంటో తెలుసన్నారు.
బెంగాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అక్కడ రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే రాజకీయ హింస చెలరేగింది. ఆ ఘటనలపై దుమారం రేగింది.రాష్ట్రపతి పాలన విధిస్తామన్నట్లుగా గవర్నర్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అది సద్దుమణిగిపోయిందనుకునే లోపల వాటిపై విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ తరుణంలో మళ్లీ కోల్ స్కాం పేరుతో ఈడీ విచారణలు ప్రారంభించింది. దేశంతో ఎంతో మంది అవినీతి పరులైన రాజకీయ నేతల కేసులు నత్తనడకన సాగుతున్నాయని ఓ వైపు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా… లైట్ తీసుకుంటున్న కొత్తగా వివాదాస్పద రాజకీయ కేసుల విషయంలో మాత్రం దూకుడు చూపిస్తూండటం విమర్శలకు కారణం అవుతోంది.