ఆంధ్రప్రదేశ్ రాజధాని వైజాగ్ అని కేంద్రం ప్రకటించేసిందోచ్ అని నిన్నంతా కొంత మంది హడావుడి చేశారు. కొంత మంది నిరసన వ్యక్తం చేశారు. కేంద్రమే డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ఇక ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదని గుడివాడ అమర్నాథ్ లాంటి వైసీపీ డైనమిక్ లీడర్స్, రాజధాని వైజాగేనని కేంద్రం సంకేతాలు పంపిందని అవంతి శ్రీనివాస్ వంటి మంత్రులు మీడియా ముందు తేల్చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా కంగారు పడింది. తాము వైజాగ్‌ను ాజధానిగా ప్రకటించలేదని .. ఏ పత్రం చూసి వారు రాజధానిగా వైజాగ్‌ను ప్రకటించామని అనుకుంటున్నారో… అది తప్పని తెలిపింది.
పెట్రోల్ రేట్ల గురించి చెబుతూ ఏపీ రాజధాని వైజాగ్ అని సమాచారం..!
గత నెల అంటే జూలై 26వ తేదీన కేంద్రానికి లోక్‌సభలో ఓ ఎంపీ ప్రశ్న అడిగారు. అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రాలపై పెట్రో ధరల పెంపు ప్రభావం ఎలా ఉందని అని ఆ ప్రశ్న సారాంశం. దానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. ఆ సమాధానంలో అన్ని రాష్ట్రాల పెట్రోల్ రేట్లు గత ఏడాది.. ఈ ఏడాది కంపేరిజన్ ఇచ్చారు. ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఉన్న రేట్లు ఇచ్చారన్నమాట. అక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనే చోట వైజాగ్ అని రాశారు. అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎవరో ఆ ఆన్సర్‌ను బయటకు తీశారు. దాదాపుగా నెల దాటిపోయింది. అయినా ఇది కేంద్రం ప్రకటించేసిందని రచ్చ చేయడం ప్రారంభించారు. నిజానికి అదే డాక్యుమెంట్లో హర్యానా రాజధాని అంబాలా అని ఉంది. పంజాబ్ రాజధాని జలంధర్ అని ఉంది. ఆ రెండు రాష్ట్రాల రాజధానులు అవి కావు. పంజాబ్‌కు కలిసి ఉమ్మడి రాజధానిగా చండీఘడ్ ఉంది. అయితే ఈ పెట్రోలియం ధరల డాక్యుమెంట్లో మాత్రం రెండు వేర్వేరుగా నగరాలు ఉన్నాయి.
“ప్రధాన నగరాల్లో” సమాచారం ఇచ్చే పెట్రో శాఖ..క్యాపిటల్ అని రాయడమే వివాదానికి కారణం..!
పెట్రో ధరలు పెరిగిన తర్వాత లేదా తగ్గిన తర్వాత ధరలు ఎంత ఉన్నాయని ప్రధాన నగరాల్లో సమాచారాన్ని మీడియా ప్రకటిస్తూ ఉంటుంది. ఆ ప్రధాన నగరాల భాష కేంద్ర పెట్రోలియం శాఖదే . అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ ప్రధాన నగరాలు అనే పదాన్ని తీసేసి ఎంపీకి ఇచ్చిన ఆన్సర్లో రాజధానులు అని పెట్టడంలోనే సమస్య వచ్చింది. దీనిపై పంజాబ్, హర్యానాల్లో ఎవరూ గగ్గోలు పెట్టలేదు. ఎందుకంటే పెట్రోలియం మంత్రిత్వ శాఖలో ఏదో క్లరికల్ మిస్టేక్ జరిగినంత మాత్రాన రాష్ట్రాల రాజధానులు మారిపోతాయా అని వారి డౌట్. కానీ ఏపీలో మాత్రం ఎవరి వాదనతో వారు తెరపైకి రావడంతోనే సమస్య వచ్చింది.
సాయంత్రానికి క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
వైజాగ్‌ను కేంద్రం రాజధానిగి డిక్లేర్ చేసిందన్న అభిప్రాయానికి ఏపీలో కొంత మంది రావడం ..ప్రభుత్వంలో ఉన్న వారే నేరుగా మీడియాకు చెప్పడంతో కేంద్రం ఆదివారం అయినా స్పందించింది. వైజాగ్ ఏపీ రాజధాని అని చెప్పటం తమ ఉద్దేశం కాదని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ ఏపీ రాజధాని కాదని, అది ఒక నగరం మాత్రమేనని వెల్లడించింది. పెట్రోలియం ట్యాక్స్‌కు సంబంధించి మాత్రమే విశాఖ పేరును ఉదహరించామని పేర్కొంది. హెడ్డింగ్ పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని కేంద్రం తెలిపింది. హెడ్డింగ్‌లో క్యాపిటల్‌తో పాటు సమాచారం సేకరించిన నగరం పేరును ఇప్పుడు చేర్చుతున్నామని ప్రకటించింది. లోక్‌సభ సచివాలయానికి కూడా సమాచారం ఇచ్చామని, ప్రధాన నగరాలలో పెట్రోల్ ధరల ప్రభావాన్ని అంచనా వేశామని తెలిపింది. హర్యానాలో అంబాలా, పంజాబ్‌లో జలంధర్ నగరాలను తీసుకున్నామని ఆ నగరాలు ఆ రాఫ్ట్రాల రాజధానులు కావని కేంద్రం స్పష్టం చేసింది.
కేంద్రం పదే పదే ఎందుకిలా చేస్తోంది.. ?
కొద్ది రోజుల కిందటే ఇలాంటి వివాదం వస్తే.. తర్వాత కేంద్రం కేంద్ర సర్దుకుని ఆ అంశం ప్రస్తుతం కోర్టులో ఉందని చెప్పి సర్దుకుంది. నిజానికి కోర్టులో కేసులు తేలనంత వరకు కేంద్రం చెప్పినా.. చెప్పకపోయినా మూడు రాజధానులు ఫైనల్ కాదు. ఆ విషయాన్ని ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. కానీ విచిత్రంగా కేంద్రంలో ఉండే అనేక రకాల శాఖల్లో ఏదో ఓ శాఖ గందరగోళానికి గురయి ఓ సారి అమరావతి అంటే.. ఇదిగో అమరావతిలోనే ఉందని కొంత మంది రెచ్చిపోవడం.. వైజాగ్ అనిఇస్తే .. అది గో రాజధానికి అంగీకరించిందని చెప్పడం కామన్ అయిపోయింది. కానీ కోర్టులో తేలిన తరవాత ఏదైనా అధికారికం అవుతుంది.