తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు నర్సీపట్నం వద్ద అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఆదివారం సాయంత్రం హఠాత్తుగా చింతమనేనిని అరెస్ట్ చేశారన్న వార్త గుప్పుమంది. శనివారం ఆయన పెట్రో ధరల పెంపుపై ఆందోళనలు చేశారని అందుకు పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మీడియాకు లీక్ ఇచ్చారు. కానీ ఆయన నర్సీపట్నం వెళ్తే అక్కడకు ప్రత్యేక బృందాలను పంపి మరీ అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏమిటనేది చాలా మందికి పజిల్‌గానే ఉండిపోయింది. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే కేసులు పెడతారు. అరెస్ట్ చేయాలనుకుంటే చేస్తారు కానీ ఆయన వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తే జిల్లాలు దాటి మరీ అరెస్ట్ చేయడం ఏమిటనేది చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.
నిజానికి ఆయన ఏజెన్సీలో ఓ పెళ్లికి హాజరై మళ్లీ దెందులూరు వెళ్తున్నారు. అరెస్ట్ చేయదల్చుకుంటే అక్కడే చేయవచ్చు. కానీ ఎదురు వచ్చి.. పోలీసు బలగాలను పెద్ద ఎత్తున రంగంలోకి దింపి ఎందుకు అరెస్ట్ చేశారో మాత్రం ఎవరికీ తెలియదు. ఈ అంశంపై విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల ఎస్పీలు భిన్నంగా స్పందించారు. సమాచారం లేకుండా ఆ ప్రాంతానికి వచ్చినందుకే అదుపులోకి తీసుకున్నామని విశాఖ ఎస్పీ మీడియాకు చెప్పారు. చింతమనేనిని అరెస్ట్ చేశారని తెలిసిందని అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక బృందాన్ని పంపుతున్నామని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ చెప్పుకొచ్చారు.
చింతమనేని అరెస్ట్ చేయాలని ఆదేశాలు వస్తే అమలు చేసేశారు కానీ ఎందుకు ఏమిటీ అన్నది పోలీసులకు కూడా తెలియదని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. చింతమనేని ప్రభుత్వ హిట్ లిస్ట్‌లో ఉన్నారు. ప్రభుత్వం మారగానే ఆయనను చాలా కాలం పాటు జైల్లో పెట్టారు. తరచూ ఆయనపై ఏదో వివాదంలో కేసులు నమోదు చేస్తూనే ఉంటారు.