ఇళ్లు కట్టిస్తామని డబ్బులు వసూలు చేసి ఆనక చేతులెత్తేసి షో చేసే రియల్టర్‌ని ఏమంటారు..? పచ్చి మోసగాడంటారు. డబ్బులు కట్టిన వారు ఆ మోసగాడిని కోర్టుకీడుస్తారు. ఎంత పరువు తీయాలో అంత తీస్తారు..! ఎందుకంటే వారు కట్టింది రెక్కలు ముక్కులు చేసుకున్న డబ్బు . ఇప్పుడు ఆ మోసగాడి రియల్టర్ పాత్రలో డబ్బులు కట్టిన వారికి ఏపీ ప్రభుత్వం కనిపిస్తోంది. బాధితులు ఎవరో కాదు హ్యాపినెస్ట్ ప్రాజెక్ట్ కస్టమర్లు. సీఆర్డీఏ పరిధిలో అపార్టుమెంట్లు కట్టి అమ్మేందుకు సీఆర్డీఏ హ్యాపినెస్ట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇలా ప్రారంభించడం .. అలా అమ్ముడవడం అయిపోయాయి. కస్టమర్లు తమ ఫ్లాట్ ఖరీదులో పది శాతం బుకింగ్ అప్పుడే కట్టేశారు. అలా వారు కట్టిన మొత్తం రూ. 90 కోట్లు.
హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ లో భాగంగా కొనుగోలుదారులతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందం ప్రకారం వారికి 2021 డిసెంబర్ కల్లా ఫ్లాట్లు అప్పగించాలి. లేకపోతే వారికి కోర్టుకెళ్లడానికి హక్కు ఉంటుంది. తాము కట్టిన మొత్తం వడ్డీ, పరిహారంతో సహా రాబట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌ను కొత్త ప్రభుత్వం రాగానే అటకెక్కించేసింది. కానీ ఫ్లాట్ల కోసం ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వలేదు. సరి కదా వాడేసుకున్నారు. ఇప్పుడు సమయం దగ్గర పడుతూండటంతో ప్రభుత్వానికి ఏం చేయాలో దిక్కు తోచక.. కొత్త గేమ్ ప్రారంభించారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు రివర్స్ టెండర్లు పిలుస్తున్నామంటూ సమాచారం లీక్ చేశారు. ఈ నెల ఇరవై ఐదున రివర్స్ టెండర్లు వేస్తామంటున్నారు. రాష్ట్రంలో రోడ్లేయడానికే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.. ఇక అమరావతిపై ప్రభుత్వం తీరు చూసి ఎవరైనా రివర్స్ టెండర్‌కు వస్తారో లేదో చెప్పడం కష్టం.
అయితే ఇప్పుడు ప్రారంభించినా నాలుగు నెలల్లో ప్రాజెక్టు పూర్తి కాదు. రాజధాని అక్కడ లేకపోతే ఫ్లాట్లు మాకెందుకని కొనుగోలుదారులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని తెలియచెప్పేశారు. తాము కట్టిన అడ్వాన్స్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని.. సీఆర్డీఏ కార్యాలయానికి పెద్ద ఎత్తున విజ్ఞాపనలు వస్తున్నాయి. రాజధానిగా అమరావతి ఉంటుందనే తాము అక్కడ ఫ్లాట్లు కొన్నామని.. రాజధానిని అక్కడి నుంచి తరలించాలనుకున్నప్పుడు తమకు ఎందుకనే వాదన వారు వినిపిస్తున్నారు. కానీ సీఆర్డీఏ మాత్రం.. పట్టించుకోవడం లేదు. నిర్మాణానికి రివర్స్ టెండర్లకు వెళ్లిపోతోంది. అయినా హ్యాపీ నెస్ట్ కస్టమర్లు ప్రభుత్వాన్ని కోర్టుకు లాగడం ఖాయంగా కనిపిస్తోంది.