పెద్ద సినిమాలు లేవు. మీడియం రేంజు సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలకు ధైర్యం చాలట్లేదు. దాంతో చిన్న చిత్రాలకు బోల్డంత ఖాళీ దొరికేసింది. ఈ సీజన్‌ని అవి బాగా వాడుకుంటున్నాయి కూడా. ప్రతీ వారం.. నాలుగైదు సినిమాలు రావడం సర్వసాధారణమైపోయింది. అందులో ఎన్ని హిట్స్, ఎన్ని ఫ్లాపులు అనేవి పక్కన పెడితే – థియేటర్ల దగ్గర మాత్రం కొత్త పోస్టర్లు తళతళలాడుతూ ఆహ్వానిస్తున్నాయి. ఈ వారం కూడా 5 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.
అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం `101 జిల్లాల అందగాడు`. బట్టతలతో ముడిపడిన కథ ఇది. బట్టతల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో వినోదాత్మకంగా చూపించబోతున్నారు. ప్రచార చిత్రాలు ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమా ప్రచారం సైతం వైవిధ్యంగా సాగుతోంది. ఇదే కాన్సెప్టుతో బాలీవుడ్ లో`బాలా` అనే సినిమా వచ్చింది. ఆ కథకూ, ఈ కథకూ ఉన్న లింకేమిటో.. తెరపైనే చూడాలి. ఈ సినిమా సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే రోజున `డియర్ మేఘా` కూడా విడుదల కానుంది. మేఘా ఆకాష్ కథానాయికగా నటించిన సినిమా ఇది. అరుణ్ అతిథ్, అర్జున్ సోమయాజుల కథానాయికలు. ముక్కోణపు ప్రేమకథ చిత్రమిది. ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయన్న సంగతి ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. హరి గౌర అందించిన ట్యూన్లు కూడా క్యాచీగా ఉన్నాయి.
వీటితో పాటుగా కిల్లర్, అప్పుడు – ఇప్పుడు, అశ్మీ చిత్రాలు ఈ వారంలోనే రాబోతున్నాయి. చిన్న చిత్రాల సందడి ఈ నెలంతా కనిపించే అవకాశం ఉంది. కనీసం 20 నుంచి 25 చిత్రాలు సెప్టెంబరులో విడుదల కానున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.