రాజకీయంగా యాక్టివ్ కావడానికి జనసేన గట్టి ప్రయత్నం ప్రారంభించింది. ప్రభుత్వంపై నిలదీయడానికి సామాన్యులకు దగ్గరవడానికి రోడ్ల సమస్యపై పోరాడాలని నిర్ణయించుకుంది. ఏపీలో రెండు, మూడేళ్ల నుంచి రహదారుల నిర్వహణ లేదు. దాంతో మెజార్టీ రోడ్లు పాడైపోయాయి. ప్రభుత్వం బాగు చేయించడం లేదు. అప్పో సప్పో చేసి చేయిద్దామన్నా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి. అందుకే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చి రోడ్ల సమస్య పరిష్కారానికి బాటలు వేయాలన్న లక్ష్యంతో “జేఏస్పీ ఫర్ రోడ్స్” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గాంధీ జయంతి రోజు నుంచి గాంధీగిరి తరహాలో జనసేన పార్టీ ఉద్యమ కార్యాచరణ ఖరారు చేసుకుంది. గాంధీ జయంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం చేసి రోడ్లు బాగు చేయాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల శ్రమదానంలో పాల్గొనే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు జనసేన కార్యకర్తలందరూ రోడ్లపైనే ఉండాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితిపై వీడియోలు తీసి మీడియా ద్వారా, సోషల్ మీడియలో పోస్ట్ చేయనున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ అన్న పేరుతో హాష్ ట్యాగ్ పెట్టి పోస్ట్ చేయనున్నారు. .
రోడ్ల దుస్థితి గురించి జనసేన పార్టీ పూర్తి సమాచారం సేకరించింది. లక్షా ఇరవై ఆరు వేల కిలోమీటర్ల రోడ్లు పాడైపోయాయని జనసేన నేతలు చెబుతున్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రమాదాలు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత జనసేన క్యాడర్లో కదలిక ఈ కార్యక్రమం ద్వారా వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇక ముందు కూడా అదే తరహాలో పోరాడాలని జనసేన నేతలు భావిస్తున్నారు.