ఈనాడు చీఫ్ కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్ బుక్ ఎకౌంట్ ద్వారా తెలియపరిచారు. దాదాపు 40 ఏళ్లుగా ఈనాడులో ఉద్యోగిగా ఉంటున్నారాయన. ఇటీవలే 40 ఏళ్ల పండగ కూడా చేసుకున్నారు. మరింత కాలం ఆయన ఈనాడులోనే ఉంటారనుకున్నారు. కానీ సడన్ గా రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చారు.
ఈనాడు అంటే శ్రీధర్.. శ్రీధర్ అంటే ఈనాడు అన్నట్టు సాగింది ఆయన ప్రస్థానం. తొలి పేజీలో పాకెట్ కార్ట్యూన్తో ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఆయన విసిరే వ్యంగ్య బాణాలకు లక్షలాదిమంది అభిమానులు ఏర్పడ్డారు. ఆయన కార్టూన్ కోసమే ఈనాడు పేపర్ చందాదారులుగా మారిన వాళ్లెంతో మంది. ఈనాడులో అత్యధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగి ఆయన. ఆయన్ని ఈనాడు యాజమాన్యం ఎప్పుడూ ఉద్యోగిగా చూడలేదు. రామోజీరావు దత్త పుత్రుడిగానే చూసింది. ఈ విషయాన్ని రామోజీ రావు సైతం చాలా సందర్భాల్లో చెప్పారు. సాక్షి మొదలైనప్పుడు శ్రీధర్‌కి మంచి ఆఫర్ వచ్చింది. కానీ శ్రీధర్ ఈనాడుని వదిలి వెళ్లలేదు. అలాంటి శ్రీధర్ ఇప్పుడు రాజీనామా చేయడం షాకింగ్ విషయమే.
కరోనా తరవాత ఈనాడు యాజమాన్యంలో చాలా మార్పులొచ్చాయి. పెద్ద తలకాయల్ని తప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. తద్వారా జీతాల భారం తగ్గించుకోవాలన్నది యాజమాన్య ఉద్దేశ్యం. ఎవరిని తప్పించినా శ్రీధర్ జోలికి మాత్రం రారన్నది అందరి నమ్మకం. అయితే శ్రీధర్ రాజీనామాతో అది తప్పని తేలింది. అన్నట్టు శ్రీధర్ ఒక్కరే కాదు.. ఈనాడు నుంచి చాలామంది ఇప్పుడు తప్పుకుంటున్నార్ట. అసలు విషయమేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.