హుజురాబాద్‌లో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని నాన్ లోకల్ అయినా పర్వాలేదని ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ పట్టుదలగా ఉన్నారు. ఆయన కొండా సురేఖ పేరును హైలెట్ చేస్తున్నారు. ఆమె కూడా కొన్ని షరతులతో పోటీకి అంగీకరించింది. అయితే కొండా సురేఖ పేరును వ్యతిరేకించేవారు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగానే ఉన్నారు. రేవంత్ రెడ్డితో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న వర్గం ఆమె వద్దన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్‌కు చెప్పారు. వారు హుజురాబాద్‌లో లోకల్ అభ్యర్థినే నిలబెట్టాలని తమ అభిప్రాయం చెబుతున్నారు. ఒత్తిడి తెస్తున్నారు. అయితే లోకల్లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి లేరు. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉండగానే టీఆర్ఎస్తో కలిసిపోయి… చివరికి బయటకుపోయారు. ఆయన తర్వాత హుజురాబాద్‌లో గట్టి నేతలుగా భావించిన కొంత మంది కూడా కారెక్కేశారు.
ఇక రేసులో ఉన్న వాళ్లంతా అంత బలమైన వాళ్లు కాదన్న అంచనాకు వచ్చారు. అందుకే బీసీ వర్గాల్లో పలుకుబడి ఉన్న కొండా సురేఖను తీసుకొచ్చి నిలబెట్టాలని అనుకుంటున్నారు. అటు బీజేపీ.. ఇటు టీఆర్ఎస్కు అభ్యర్థి టెన్షన్ లేదు. వారు అభ్యర్థుల్ని కూడా ప్రకటించుకుని రంగంలోకి దిగిపోయారు. కానీ కాంగ్రెస్‌లో మాత్రమే అభ్యర్థి ఖరారు కాలేదు. ప్రచారం ప్రారంభించలేదు. ఇప్పుడల్లా అభ్యర్థి ఖరారయ్యే అవకాశం కూడా కనిపించడం లేదు. పార్టీలో రేవంత్ రెడ్డి మాట చెల్లుతోంది. హైకమాండ్ కూడా ఆయనకు విలువ ఇస్తోంది. ఈ క్రమంలో ఆయన చాయిస్ అయిన కొండా సురేఖ పేరే అభ్యర్థిగా ఖరారవుతుంది. అందులో సందేహంలేదు. కానీ ఆమె ప్రచారం మాత్రం ప్రారంభించకోలేరు. అలా ప్రారంభిస్తే లేనిపోని వివాదాలొస్తాయి. అధికారిక ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ఉంటుందో చెప్పలేని పరిస్థితి.
పదిహేడో తేదీన వరంగల్‌లో దళిత, గిరిజన దండోరా నిర్వహించాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీ ఆ సభకు వస్తారని అంటున్నారు. ఆ వేదిక పై నుంచి కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. అప్పటి వరకూ ఆమె హుజురాబాద్‌లో ప్రచారం చేసుకోలేరు. ఈ లోపు ఉపఎన్నికల షెడ్యూల్ వస్తే ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. కానీ కాంగ్రెస్ మాత్రం.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటికీ కొన్ని విషయాల్లో ఎప్పట్లానే ఉందని.. ఈ అభ్యర్థి ఎంపిక ప్రక్రియతో తేలిపోతోందని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తి చెందుతున్నారు.