సంప్రదాయ భోజనం పేరుతో గత వారం రోజులుగా టీటీడీ వర్గాలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కానీ చివరికి ఆ సంప్రదాయ భోజనాన్ని అమ్మాలని నిర్ణయించడంతో వివాదం ఏర్పడింది. ఉచిత భోజనాన్ని ఎత్తేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపణలు రావడంతో వివరణ ఇచ్చుకోవడానికి టీటీడీ తంటాలు పడాల్సి వచ్చింది. అదే సమయంలో రంగంలోకి దిగిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి.. ఇప్పటి వరకూ ఆ సంప్రదాయ భోజనం అనే దాని గురించే తనకు తెలియదన్నట్లుగా మాట్లాడారు . అసలు శ్రీవారి ప్రసాదం అమ్మడం ఏమిటన్నట్లుగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బోర్డు లేని సమయంలో అధికారులు తీసుకున్న నిర్ణయంగా చెప్పి.. రద్దు చేసేస్తున్నట్లుగా ప్రకటించారు.
అంతే కాదు శ్రీవారి అన్న ప్రసాదాలు ఏవైనా అమ్మకూడదని ఉచితంగానే ఇవ్వాలని తేల్చేశారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్న అధికారులు అవమానపడాల్సి వచ్చింది.ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా జేఈవో ధర్మారెడ్డి ఉన్నారని చెబుతున్నారు. ఈవోగా సింఘాల్ ఉన్నా… జవహర్ రెడ్డి ఉన్నా.. ఎక్కువగా చక్రం తిప్పేది ధర్మారెడ్డినే. ఆయన వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. అందుకే టీటీడీలో ఆయన చెప్పినట్లే నడుస్తుంది. అయితే ఆయన డామినేషన్ సుబ్బారెడ్డికి కూడా నచ్చలేదన్న ప్రచారం జరుగుతోంది. తనకు రెండో సారి టీటీడీ చైర్మన్ పదవి ప్రకటించడం ఆలస్యమయింది. ఈ సమయంలో సుబ్బారెడ్డి సిఫార్సులను కూడా టీటీడీ పెద్దగా పట్టించుకోలేదు.
అదే సమయంలో చాలా విషయాల్లో ధర్మారెడ్డి భిన్నమైన అభిప్రాయాలతో ఉంటున్నారని అంటున్నారు. మామూలుగా తప్పును అధికారులపై నెట్టాల్సిన అవసరం లేదు. వేరే కారణం చెప్పొచ్చు. కానీ నేరుగా అలా చేయడం తప్పని తేల్చి.. దాన్ని అధికారులు తీసుకున్నారని చెప్పడంతోనే వివాదం ప్రారంభమయింది. టీటీడీ చైర్మన్ అధికారుల మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న అభిప్రాయం మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది.