ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఒకసారి మాట ఇస్తే ఆ మాట తప్పడు అంటూ ఆ పార్టీ కార్యకర్తలు నేతలు తరచూ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వారు వ్యాఖ్యానించినట్లు జగన్ మాట తప్పకుండా ముందు చెప్పిన ప్రకారం ఆగస్టు నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తారని భావించిన నిరుద్యోగులకు మళ్ళీ ప్రభుత్వం మొండిచేయి చూపించినట్లు కనిపిస్తోంది. దీంతో నిరుద్యోగులు నిరుత్సాహానికి లోను అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
2019లో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనేక వర్గాలతో పాటు నిరుద్యోగులు మద్దతు పలకడం కూడా ప్రధాన కారణం. ఎన్నికలకు ముందు జరిగిన పాదయాత్రలో జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయని, మన ప్రభుత్వం రాగానే వాటిని భర్తీ చేస్తామని, యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని వాగ్దానం చేశారు. తమ భవిష్యత్తుపై భరోసా కల్పించిన ఈ వాగ్దానం చూసి అనేక మంది నిరుద్యోగులు జగన్ వైపు మొగ్గు చూపారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా నోటిఫికేషన్లు రాకపోవడంతో సోషల్ మీడియా వేదికగా నిరుద్యోగులు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాజకీయ పరమైన విమర్శలు కూడా రావడంతో జగన్ ప్రభుత్వం ఈ సంవత్సరం జూన్ లో జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. నిజానికి జాబ్ క్యాలెండర్ అంటే ఏ ఉద్యోగానికి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది , ఎప్పుడు పరీక్ష ఉంటుంది, ఎప్పుడు ఫలితాలు వస్తాయి లాంటి పూర్తి వివరాలు ఉండాలి. కానీ అవేవీ లేకుండా కేవలం ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుందో తెలుపుతూ ఒక ప్రకటన జారీ చేసి దానిని జాబ్ క్యాలెండర్ అని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే అలా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నా ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గ్రూపు 1, 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. కానీ ఆగస్టు నెల పూర్తయినా కూడా జాబ్ క్యాలెండర్ రాకపోవడం నిరుద్యోగులకు నిరాశ కలిగిస్తోంది. ఆగస్టు నెలలో విడుదల చేస్తామన్న ఏపీపిఎస్సి నోటిఫికేషన్ రాకపోవడం తో, సెప్టెంబర్ ,నవంబర్ తదితర నెలలో వస్తాయి అని చెప్పిన నోటిఫికేషన్లు అయినా వస్తాయో రావో అన్న ఆందోళన నిరుద్యోగుల లో నెలకొని ఉంది.