జగనన్నను జైలుకు పంపినప్పుడు అన్నం మానేసిన పసిబిడ్డల గురించి సాక్షి మనకు పరిచయం చేసింది. జగన్ కాళ్లకు బొబ్బలెక్కినప్పుడు స్కూలుకు పోనని.. జగననన్నను చూడాలని మారాం చేసిన ప్లే స్కూల్ స్టూడెంట్స్ గురించి తెలిపింది. జగననన్న తొలి సారి ఓడిపోయినప్పుడు .. మళ్లీ ఆయన సీఎం అయ్యే వరకూ చెప్పులేసుకోనని పంతం పట్టిన యువత గురించీ తెలిపింది. అవన్నీ వైరల్.. ఇప్పుడు కొత్తగా మరికొన్ని టాస్కులను సాక్షి మీడియా తీసుకుంది. అందులో మొదటి టాస్క్ వైఎస్‌కు భారతరత్న ఇవ్వాలని చిన్నపిల్లలతో ప్రచారం చేయించడం.
విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న అనే విద్యార్థిని ప్రెస్‌మీట్ పెట్టింది. ఆమెది నెల్లూరు జిల్లా. స్కూల్ డ్రెస్‌లోనే వచ్చి విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం పెట్టి వైఎస్ రాజశేఖరరెడ్డికి భారత రత్న ఇవ్వాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు లేఖ రాసినట్లుగా కూడా చెప్పారు. వైఎస్ ఏం చేశారంటే ఆరోగ్యశ్రీ, 108, 104 ఫ్రీ అంబులెన్స్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారని..ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగ చేశారని చెప్పుకొచ్చింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని.. అందుకే వైఎస్సార్‌కు భారత రత్న ఇవ్వాలని కోరింది. వైఎస్సార్ జీవిత చరిత్రను ప్రైమరీ స్కూల్ సిలబస్‌లో ఒక పాఠ్యాంశంగా చేర్చాలని సీఎం జగన్‌ను కోరింది.
ఈ బాలికతో లేఖ ఎవరు రాయించారో.. ఎవరు ప్రెస్‌మీట్ పెట్టించారో ప్రత్యేకంగా పరిశోధన చేసి తెలుసుకోవాల్సిన పనిలేదు. ఎనిమిదో తరగతి బాలిక అంటే వైఎస్ చనిపోయే నాటికి ఆమె అప్పుడే పుట్టి ఉంటారు. అసలు తనకు ఊహ తెలిసే నాటికి చనిపోయిన వైఎస్ గురించి ఏం చేశారో తనే చూసినట్లుగా లేఖ రాసి.. మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పడం సరికొత్త సెంటిమెంటల్ ప్రచారంలో భాగమని సెటైర్లు వేస్తున్నారు. ఇది ప్రారంభమేనని ఈ బాలిక ప్రెస్‌మీట్‌ను స్ఫూర్తిగా తీసుకుని మరికొంత మంది వైసీపీ నేతలు తమ పిల్లలతో ఇలాంటివే చేయించడం.. వాటికి సాక్షి అపరిమితమైన ప్రచారం ఇవ్వడం ముందు ముందు చూడవచ్చంటున్నారు.