కార్టూనిస్ట్ శ్రీధర్ ఈనాడుకి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితమే ఆయన ఈనాడుకి రాజీనామా చేసినా… ఈనాడు లెక్కల ప్రకారం నిన్నటితో (మంగళవారం)తో ఈనాడులో ఆయన ప్రస్థానం ముగిసింది. మరి శ్రీధర్ తరవాతి ప్రణాళికలేంటి? ఆయనేం చేయబోతున్నారు? అనేది ఇప్పుడు మీడియా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
శ్రీధర్ నిష్క్రమణ గురించి తెలుసుకున్న కొన్ని మీడియా సంస్థలు… వెంటనే శ్రీధర్‌కి టచ్‌లో వెళ్లినట్టు టాక్. అందులో ఈనాడుతో పోటీ పడుతున్న ఓ అగ్ర సంస్థ కూడా ఉంది. ఓ ఆంగ్ల పత్రిక సైతం శ్రీధర్ కి భారీ ఆఫర్ ఇవ్వజూపినట్టు సమాచారం. అయితే… వీటన్నింటినీ శ్రీధర్ పక్కన పెట్టారు. తనకు ఇక మీదట మీడియాలో పనిచేసే ఉద్దేశ్యమే లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. నాలుగేళ్ల నుంచీ.. ఆయన ఈనాడుని వదిలేయాలని అనుకుంటున్నార్ట. కేవలం విశ్రాంత జీవితాన్ని గడపడానికే ఈనాడుని వదిలానని, మరో సంస్థలో కాలు పెట్టనని శ్రీధర్ చెబుతున్నారని టాక్.
శ్రీధర్ ఓ ఆర్ట్ స్కూల్ స్థాపించాలని చూస్తున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. ఇక మీదట ఆ స్కూల్ బాధ్యతుల చూసుకోవడానికి సమయం కేటాయిస్తార్ట. అంతే కాదు.. ఆర్ట్ కి సంబంధించి పీహెచ్డీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నార్ట. ఈ కోరిక… ఇప్పుడు తీర్చుకోవడానికి సమయం దొరికినట్టైంది.