ఒక వైపు సినిమాలు – మరోవైపు రాజకీయాలు.. అంటూ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు పవన్ కల్యాణ్. రెండు పడవల ప్రయాణం ఎవరికైనా కష్టమే. అందుకే సినిమాలు చేస్తున్నప్పుడు రాజకీయాలకు, రాజకీయాల టైమ్ వచ్చినప్పుడు సినిమాలకూ దూరంగా ఉంటున్నాడు. పవన్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. హరి హర వీరమల్లు, భీమ్లా నాయక్ తో పాటుగా.. హరీష్ శంకర్ సినిమా ఉంది. ఇది కాక రెండు మూడు అడ్వాన్సులు తీసుకున్నాడు పవన్. వాటన్నింటికీ న్యాయం చేయాలి. మరోవైపు.. రాజకీయాలతో టచ్ లో ఉండాలి. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలెట్టాలి.
అయితే ఈలోపు పవన్ కోసమే కొత్త కథలు తయారవుతున్నాయి. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ దర్శకుడు కరుణ కుమార్ పవన్ కోసం ఓ కథ సిద్ధం చేసుకున్నాడట. కరుణ కుమార్ కథల్లో బలమైన సామాజిక కోణం ఉంటుంది. అలాంటి కథల్లో పవన్ లాంటి మాస్ హీరో, మాస్ లీడర్ కనిపిస్తే…. ఆ మైలేజీ వేరు. అందుకే పవన్ కోసం ఓ కథ రెడీ చేసుకున్నాడాయన. మరోవైపు వేణు ఉడుగుల సైతం ఓ కథ సిద్ధం చేసినట్టు టాక్. ప్రస్తుతం `విరాటపర్వం` సినిమా చేస్తున్నాడు వేణు. తనదీ అభ్యుదయ గళమే. పవన్ అయితే తన కథలకు పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు. పవన్ తో ఇప్పుడు సినిమా చేయడం ఈజీ అయిపోయింది. కొత్త దర్శకులకు చాలా సులభంగా అవకాశాలు ఇచ్చేస్తున్నాడు పవన్. కాకపోతే ఒకటే.. త్వరగా సినిమా పూర్తి చేసే కెపాసిటీ కావాలంతే. ఆ లెక్కన ఈ ఇద్దరు దర్శకులకూ పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ ఇప్పుడు పవన్ దగ్గర లేనిది టైమ్ మాత్రమే. ముందు భీమ్లా నాయక్ పూర్తి చేయాలి. ఆ తరవాత వీరమల్లు పని పట్టాలి. 2021 వరకూ వీటితోనే. ఆ తరవాత హరీష్ శంకర్ సినిమా ముగించాలి. ఆ వెంటనే.. సురేందర్ రెడ్డి లైన్ లో ఉన్నాడు. ఇవన్నీ పూర్తయిన వెంటనే ఎన్నికల శంఖారావం వినిపిస్తుంది. ఎన్నికల తరవాత రాజెవరో, మంత్రెవరో. సో… పవన్ దగ్గర ఇప్పుడు లేనిది టైమ్ ఒక్కటే.