హుజూరాబాద్ ఉపఎన్నికల కోసమే పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధును అమలు చేస్తున్నారన్న విమర్శలు మరింత పెరగకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని నాలుగు వైపులా ఉండే నాలుగు జిల్లాల్లో ఒక్కో మండలంలో దళిత బంధును అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని మండలాలను ఎంపిక చేశారు. అయితే ఇలా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని మండలం కూడా ఉంది.
మధిర నియోజకవర్గం: చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, జుక్కల్ నియోజకవర్గం: నిజాం సాగర్ మండలంలో రైతు బంధును అమలు చేస్తారు. ఇక్కడ కూడా హుజురాబాద్‌తో సమాంతరంగా ప్రక్రియ నిర్వహిస్తారు. అర్హుల్ని ఎంపిక చేసి పథకాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నాలుగు నియోజకవర్గాలు తెలంగాణలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఉన్నాయి.
ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీలో కార్యాలయ శంకుస్థాపన కోసం ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల్లో తిరిగి వస్తారు. ఆ తర్వాత నాలుగు మండలాలు ఉన్న జిల్లాల మంత్రులు, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో హైదరాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహిస్తారు. పథకం అమలుపై విధివిధానాలు ఖరారు చేస్తారు. హుజురాబాద్‌లో ఇప్పటికే దళితుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. తదుపరి కార్యచారణ ఖరారు చేయనున్నారు. అయితే నాలుగు మండలాలు అంటే..మరో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో లబ్దిదారులు ఉంటారు. పైగా రిజర్వుడు నియోజకవర్గాల్లో కాబట్టి లబ్దిదారులు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఈ కారణంగా మరో రెండు నుంచి రెండున్నర వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే రాష్ట్రం మొత్తం పథకాన్ని అమలు చేస్తామన్న నమ్మకం కలిగించడానికి కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకే నాలుగు వైపులా నాలుగు మండలాలను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందరికీ ఇవ్వాలని నిర్ణయించడంతో ప్రతి ఒక్క దళిత కుటుంబ లబ్దిపొందనుంది.