టక్ జగదీష్ సినిమాని ఓటీటీలో విడుదల చేయడం… స్వతహాగానే ఎగ్జిబీటర్లకు నచ్చలేదు. వాళ్ల ఆగ్రహ ఆవేశాలు బాహాటంగానే వెళ్లగక్కారు. నాని సినిమాల్లో మాత్రమే హీరో అని – బయట విలన్ అని ఎటకారం చేశారు. నాని సినిమాల్ని థియేటర్లో బ్యాన్ చేస్తామని హెచ్చరించారు.
ఇవన్నీ నాని మనసుకు గుచ్చుకోకుండా ఉంటాయా? నాని నొచ్చుకోకుండా ఉంటాడా? తన బాధని టక్ జగదీష్ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్‌లో వెళ్లగక్కాడు. థియేటర్ల పరిస్థితులు బాగాలేవని, అందుకే ఓటీటీకి వెళ్లాల్సివచ్చిందని, తాను కూడా బాధితుడినే అంటూ తన బాధని పంచుకున్నాడు. పరిస్థితులు బాగున్నప్పుడు తన సినిమాని ఓటీటీకి ఇస్తే.. తనని తానే బ్యాన్ చేసుకుంటానని నాని ప్రకటించాడు. ఎగ్జిబీటర్ల బాధని తాను అర్థం చేసుకోగలని, కాకపోతే.. ఆ సందర్భంలో తనని పరాయివాడ్ని చేయడం బాధించిందని చెప్పాడు. నాని బాధని అర్థం చేసుకోవాల్సిందే. టక్ జగదీష్ సినిమాని థియేటర్లో విడుదల చేయడానికి నాని ఓ మినీ సైజు పోరాటం చేశాడు. ఓటీటీలో ఈ సినిమాని విడుదల చేయడం తనకీ నచ్చలేదు. `వి` సినిమా ఓటీటీకి వెళ్లడం వల్ల ఏం జరిగిందో నానికి తెలుసు. మళ్లీ అలాంటి తప్పు చేయడానికి నాని ఎందుకు సాహసిస్తాడు? పైగా టక్ జగదీష్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమాని థియేటర్లలోనే చూడాలి. కాకపోతే.. నిర్మాతల బాధని తానూ అర్థం చేసుకోవాలి. వాళ్ల కష్టాల్ని పంచుకోవాలి. అందుకే విధిలేక ఓటీటీకి ఒప్పుకోవాల్సివచ్చింది. నాని బాధని ఇకనైనా ఎగ్జిబీటర్లు అర్థం చేసుకుంటారో లేదో?