అక్రమాస్తుల కేసు విచారణను ఆలస్యం చేయడానికి విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు న్యాయనిపుణులను కూడా అబ్బుర పరుస్తున్నాయి. గత రెండు వాయిదాలుగా ఆయన సీబీఐ, ఈడీ కోర్టుకు ఒకటే చెబుతున్నారు. ముందు ఈడీ కేసులను విచారించాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని విచారణ ప్రారంభించవద్దని కోరుతున్నారు. ఆయన విజ్ఞప్తిని మన్నించిన కోర్టురెండు సార్లు వాయిదా వేసింది. మొదటి సారి లాయర్‌తో ఆ మాట చెప్పించి వాయిదా వేయించారు. తర్వాత అఫిడవిట్ వేసి వాయిదా కోరారు. అసలు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వెళ్తే సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే అప్పుడు విచారణ ఆగడానికి అవకాశం ఉంది.
అసలు ఇంత వరకూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయకుండా .. అక్కడ పిటిషన్ వేస్తామని కింది కోర్టులో విచారణ జరగకుండా వాయిదాలు వేయించుకోవడమే అసలు నేర్పరితనం అని లాయర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయదల్చుకుంటే గంటలో పని. ఆయన అటు దిగువకోర్టులోనూ.. ఇటు హైకోర్టులోనూ ముందుగా ఈడీ కేసుల విచారణ వద్దని పిటిషన్లు వేశారు. తన తరపు వాదనలు.. పాయింట్లు అన్నీ వినిపించారు. వీటితోనే సుప్రీంకోర్టులోనూ ఆయన పిటిషన్ వేయవచ్చు. ఆయనకు నిష్ణాతులైన లాయర్ల బృందం ఉంది. కానీ రెండు వాయిదాలుగా వెళ్తాం.. వెళ్తాం అని చెబుతున్నారు కానీ సుప్రీంకోర్టులో మాత్రం పిటిషన్ దాఖలు చేయలేదు.
ఆ పేరుతో విచారణ మాత్రం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఏళ్ల తరబడి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరుగుతోంది. ఈడీ కేసుల విచారణ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ కేసుల్లో ఆర్థిక లావాదేవీలు రికార్డెడ్‌గా ఉంటాయి కాబట్టి బయటపడటం కూడా కష్టమేనన్న అభిప్రాయం ఉంది. అందుకే విజయసాయిరెడ్డి విచారణ ప్రారంభం కాకుండా వీలైనంతగా ఆలస్యం చేస్తున్నారన్న అనుమానాలు ప్రారంభమవుతున్నాయి.