కథానాయిక పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలు ఎప్పుడోగానీ పుట్టవు. అలాంటి కథ, పాత్ర దొరికితే… కథానాయికలకు అదృష్టమే అనుకోవాలి. ఆ అదృష్టం మేఘా ఆకాష్ కి కాస్త తొందరగానే వరించింది. `లై`తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మేఘా. ఇప్పుడు `డియర్ మేఘ`గా రాబోతోంది. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది ముక్కోణపు ప్రేమకథ. అయితే.. కథానాయిక పాత్రే ఈ కథకు కీలకం. ఆ పాత్రలో మేఘా ఆకాష్ నటన.. ఓ రేంజ్‌లో సాగిందని ట్రైలర్లు చూస్తేనే అర్థమైపోతోంది. ఈ కథకు ఆత్మ, ప్రాణం.. మేఘ పాత్రే. అందుకే.. ఈ సినిమాపై మేఘా చాలా ఆశలు పెంచుకుంది. “ఇంత త్వరగా ఇంత గొప్ప పాత్ర నాకు దొరుకుతుందని అనుకోలేదు. ఇలాంటి సినిమా నా చేతికి రావడం నా అదృష్టం. ట్రైలర్ చూసినవాళ్లంతా.. నీకు అవార్డులు వస్తాయని చెబుతున్నారు. ప్రేక్షకులకు నచ్చితే అంతకంటే అవార్డు మరోకటి ఉండదు“ అని అప్పుడే మురిసిపోతోంది మేఘ. అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకుడు. అయితే ఈ సినిమా మలయాళ `దియా`ని పోలి ఉంటుందన్న వార్తలొస్తున్నాయి. ఆ సినిమాకి ఇది రీమేక్ అని కూడా అంటున్నారు. చిత్రబృంం మాత్రం ఈ విషయంలో గోప్యత పాటిస్తోంది. మరి కొద్ది గంటలు ఆగితే ఇది `దియా`కి రీమేకో.. కాదో తేలిపోతుంది.