కోర్టు ధిక్కరణ కేసులో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. వీరిలో ఒకరు రిటైరవ్వగా మరో నలుగురు సర్వీసులో ఉన్నారు. నెల్లూరు జిల్లా తాళ్లపాక అనే గ్రామంలో ప్రభుత్వ అవసరాల కోసం సాయిబ్రహ్మ అనే మహిళకు చెందిన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ పరిహారం మాత్రం చెల్లించలేదు. పరిహారం కోసం ఆమె అధికారులచుట్టూ చాలా సార్లు తిరిగారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వ పరంగా తాను పెట్టుకోవాల్సిన అర్జీలన్నీ పెట్టుకున్నారు. ఎవరూ పట్టించుకోలేదు. చివరికి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం మహిళకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
అయితే అధికారులు మాత్రం మిగతా అన్ని తీర్పుల్లాగే దీన్ని కూడా లైట్ తీసుకున్నారు. పరిహారం చెల్లించలేదు. దీంతో మళ్లీ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మన్మోహన్ సింగ్ అనే ఐఎస్‌కు నెల రోజుల జైలు, రూ.1000 జరిమానా విధించింది. ఈయన ఇప్పటికే రిటైరయ్యారు. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు రూ.1000 జరిమానా, 2 వారాల జైలు , ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఎస్.ఎస్.రావత్‌కు నెల రోజుల జైలు, రూ.1000 జరిమానా, నెల్లూరు మాజీ కలెక్టర్ ముత్యాల రాజుకు రెండు వారాల జైలు, రూ.1000 జరిమానా విధించింది. ప్రస్తుతం ముత్యాలరాజు సీఎంవోలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. మరో ఐఏఎస్ అధికారి ఇంతియాజ్‌కు కూడా నెల రోజుల జైలు రూ. 1000 జరిమానా హైకోర్టు విధించింది.
వీరందరికీ శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు హైకోర్టు నెల రోజులు గడువిచ్చింది. ఈ క్రమంలో నెల రోజుల పాటు జైలు శిక్షను సస్పెండ్ చేసింది. జరిమానాను ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి కత్తిరించి ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో కోర్టు ధిక్కరణ కింద కేసులకు .. శిక్షలకు గురవుతున్న అధికారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఒకేసారి ఐదుగురికి శిక్ష వేయడం అధికారవర్గాల్లోనూ కలకలం రేపుతోంది.