హుజురాబాద్ ఉపఎన్నిక బరి హరీష్ రావు వర్సెస్ ఈటల అన్నట్లుగా మారిపోయింది. ఇద్దరు నేతలు ఎవరికి వారు వ్యక్తిగతంగా విమర్శించేసుకుంటున్నారు. నిన్నటి వరకూ హరీష్ రావు పట్ల కాస్త సానుభూతితో వ్యవహరిస్తున్నట్లుగా ప్రకటనలు చేసిన ఈటల హఠాత్తుగా రూటు మార్చారు. నీ చరిత్ర అంతా బయట పెడతానని హరీష్‌కు కొత్తగా హెచ్చరికలు జారీ చేశారు. కారు కూతలు.. అబద్దాలను డ్రామా కంపెనీ లాగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నాడని మండిపడ్డారు. తనపై ఎన్నికల ప్రచారంలో హరీష్ చేస్తున్న వ్యాఖ్యలపై హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా లో బహిరంగ చర్చకు సిద్దమా అని సవాలు విసిరారు. నేనే అన్నీ ఏర్పాట్లు చేస్తా.. నువ్వు ఇంత తోపు, తురుం ఖాన్ వి కదా బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.
హరీష్ రావు ఇటీవల సోషల్ మీడియాలో రోడ్ మీద ఎవరితోనైనా మాట్లాడి వారి మాటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈటలఇళ్లు కట్టించలేదు. అభివృద్ది చేయించలేదు.. ఇలాంటి విమర్శలు ఎక్కువగా సోషల్ మీడియాలో చేయిస్తున్నారు. దీనిపైనే ఈటల మండిపడ్డారు. సీఎం కుర్చీ కోసం ప్రయత్నిస్తున్నారని హరఈష్పై విరుచుకు పడ్డారు. తాను కట్టించిన ఇళ్లను చూపిస్తాను తనతో పాటు రావాలని సవాల్ చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు తెలంగాణ నిధుల మీద వారికే హక్కు ఉందన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
హరీష్ రావుపై వ్యక్తిగత విమర్శలు చేయడానికి ఈటల వెనుకాడలేదు. ఆయన నీచుడని.. ఆయన నిర్వాకంపై ప్రజలు ఉమ్మేస్తున్నారని విమర్శించారు. నీకు కేసీఆర్ మంత్రి ఇవ్వను అన్నది నిజం కాదా..? సీఎం సీటుకే ఎసరు పెట్టాడని ఆరోపించారు. సీఎం పోటీకి వస్తున్నా.. అని నన్ను తొలగించారా..? లేక భూముల కబ్జా చేశాననా..?. చెప్పాలని సవాల్ చేశారు. పోలీసు దండును ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. టీఆర్ఎస్లో ఉండగా ఆప్తమిత్రులుగా పేరు పడ్డ వీరు ఇప్పుడు ఒకరిపైఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ప్రచారన్ని హోరెత్తిస్తున్నారు. నిన్నటి వరకూ హరీష్ రావుపై సానుభూతి చూపిస్తూ… ఆ పార్టీ హైకమాండ్‌లో అనుమానపు బీజాలు నాటే ప్రయత్నం చేసిన ఈటల ఇప్పుడు మాత్రం డైరక్ట్ విమర్శలకు దిగారు.