తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తి ఎపిసోడ్ దాదాపుగా ముగిసిపోయింది. ఇంత కాలం చంద్రబాబుతో భేటీ కానంటూ భీష్మించుకు కూర్చున్న ఆయన పార్టీ నేతల రాయబారంతో చివరికి మెత్తబడ్డారు. పార్టీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబుతో సమావేశమయ్యారు. గోరంట్ల సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు త్రిసభ్య కమిటీని నియమించారు. చినరాజప్ప, నల్లమల్లి రామకృష్ణారెడ్డి, గద్దె రామ్మోహన్ లతో కూడిన ఆ కమిటీ గోరంట్ల సమస్యను విన్నది. ఆయన ప్రత్యర్థి వర్గం అయిన ఆదిరెడ్డి వర్గీయుల వాదన కూడా విన్నది.
తర్వాత సమస్య పరిష్కారం కోసం… ఓ నివేదికను చంద్రబాబుకు అప్పగించారు. తర్వాత గోరంట్లను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో త్రిసభ్య కమిటీ నేతలు కూడా పాల్గొన్నారు. ఇటీవల పార్టీలో తనకు గౌరవం లభించడం లేదని ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడం కలకలం రేపింది. తన ఫోన్ కాల్స్‌ను కూడా చంద్రబాబు, లోకేష్ రిసీవ్ చేసుకోవడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుతానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చల్లబడ్డారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన ఇక రాజీనామా గురించి ఆలోచించరని.. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారని భావిస్తున్నారు. గోరంట్ల సీనియార్టీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన గౌరవానికి భంగం కలగకూడదని తూర్పుగోదావరి జిల్లా నేతలకు టీడీపీ హైకమాండ్ నుంచి సూచనలు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. గోరంట్ల పార్టీని వీడతారని ఎవరూ అనుకోలేదు కానీ ఆయన తరహా అసంతృప్తి చాలా మంది పార్టీ నేతలకు ఉందన్న అభిప్రాయం మాత్రం టీడీపీోల బలంగా వినిపించింది.