తెలుగు360 రేటింగ్: 2.5/5
తినేవాళ్ల అభిరుచిని బట్టే… వంటకం.
చూసేవాళ్ల ఇష్టాల్ని బట్టే… సినిమా.
అందుకే అన్ని కథలూ.. అన్ని వేళలా.. అన్ని చోట్లా వర్కవుట్ కావు. ఓ కథ ఓ భాషలో బాగా ఆడిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రేక్షకుల అభిరుచి చాలా ముఖ్యం. తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకుల అభిరుచి వేరు. తెలుగువాళ్ల ఇష్టాలు వేరు. అందుకే అక్కడ ఆడిన ప్రతీ కథా.. ఇక్కడ ఆడేయదు. అందుకే రీమేకుల జోలికి వెళ్లినప్పుడు పక్కా లెక్కలేసుకోవాలి. ఇదంతా ఎందుకంటే…. ఇప్పుడొచ్చిన `డియర్ మేఘ` కన్నడ హిట్ చిత్రం `దియా`కి రీమేక్. దియా ఓ అర్థ్రత నిండిన ప్రేమ కథ. సున్నితమైన హృదయాల మధ్య జరిగే సంఘర్షణ. దాన్నే తెలుగులో `డియర్ మేఘ`గా తెరకెక్కించారు. మరి.. అక్కడ దియా.. ఇక్కడ మేఘాగా వర్కవుట్ అయ్యిందా, లేదా?
కాలేజీ రోజుల్లోనే మేఘ (మేఘా ఆకాష్) అర్జున్ (అర్జున్ సోమయాజుల)ని ఇష్టపడుతుంది. చాటుమాటుగానే అయినా.. గాఢంగా ప్రేమిస్తుంది. కానీ మనసులోని మాట అర్జున్‌కి చెప్పుకోలేదు. సడన్ గా ఓ రోజు.. అర్జున్ చెప్పా పెట్టకుండా సింగపూర్ వెళ్లిపోతాడు. మూడేళ్ల తరవాత.. మళ్లీ ఇండియా వస్తాడు. మేఘా – అర్జున్ ఇద్దరూ ముంబైలో కలుసుకుంటారు. కాలేజీ రోజుల్లోనే నిన్ను నేను ప్రేమించా… కానీ చెప్పలేకపోయా.. అంటూ తన మనసులోని మాట మేఘాకి చెప్పి షాక్ ఇస్తాడు అర్జున్. ఆ తరవాత.. ఇద్దరూ ప్రేమలో మునిగిపోతారు. సడన్ గా వీరిద్దరి జీవితంలో ఓ అనుకోని ఘటన జరుగుతుంది. మేఘకి అర్జున్ దూరం అవుతాడు. అర్జున్ ని మర్చిపోలేక మేఘ సతమతమవుతుంది. ఈలోగా.. మేఘకి అభి (అదిత్ అరుణ్) పరిచయం అవుతాడు. ఆ తరవాత ఏమైంది? ఆది – మేఘల మధ్య ఎలాంటి అనుబంధం మొదలైంది? ఇంతకీ అర్జున్ ఏమయ్యాడు? అనేది తరవాతి కథ.
నిజానికి ఇదేం కొత్త కథ కాదు. ఇలాంటి ముక్కోణపు ప్రేమ కథలు ఇది వరకు చాలా వచ్చాయి. మరి `దియా`లో కన్నడ ప్రేక్షకులకు ఏం నచ్చింది? అంటే… ఎమోషన్. ముగ్గురు సున్నిత మనస్కుల హృదయాల్లో ప్రేమ రేపిన అలజడి నచ్చింది. అర్జున్ – మేఘల `సైలెంట్` లవ్.. ప్రేక్షకుల్ని సమ్మోహన పరిచి ఉండొచ్చు. ఆది – మేఘల ప్రేమకథలోఉండే సున్నితత్వం ఇంకా బాగా కట్టిపడేసి ఉండొచ్చు. అందుకే అక్కడ హిట్ అయ్యింది. తెలుగులో ఈ తరహా కథలు చాలా వచ్చాయి. అయితే ఇది పూర్తిగా.. ఓ పొయెటిక్ ఫీలింగ్ తో సాగే కథ. ఆ భావన కన్నడలో తర్జుమా అయినంత బాగా.. తెలుగులో కాలేదనే చెప్పాలి. తెలుగులో ఇంత స్లో.. గా సాగే కథలు పెద్దగా ఎక్కవు. `ఆటోగ్రాఫ్` తమిళంలో ఓ క్లాసిక్. తెలుగులో ఎందుకు ఆడలేదంటే.. అందులో వేగం. మంచి హైవే మీద.. 30 లో బండి నడిపితే హాయిగానే ఉంటుంది. కానీ. రాను రాను బోర్ కొడుతుంది. గేరు మార్చి.. స్పీడు పెంచాలనిపిస్తుంది. `డియర్ మేఘ` కూడా హైవేలో.. 30లో సాగే ప్రయాణమే. కానీ.. ఈ బండి స్పీడు పెరగదు. క్రమంగా తగ్గుతూ ఉంటుంది. దాంతో.. చుట్టూ అందమైన సీనరీలు కనిపిస్తున్నా… నీరసం ఆవహిస్తుంది.
మేఘ – అర్జున్ ఇద్దరివీ ఒకేరకమైన పాత్రీకరణలు. ఇద్దరూ నెమ్మదే. కాబట్టి. సినిమా కూడా నెమ్మదిగా సాగుతుంది. ఆది పాత్రతో కాస్త హుషారొస్తుంది. కానీ అది సరిపోలేదు. ఆ పాత్రని మరింత ఎనర్జిటిక్ గా తయారు చేయాల్సింది. కానీ రాను రాను.. ఆ పాత్ర కూడా… మేఘ పాత్రలా స్లోగా మారిపోతుంది. కథంతా అయితే మేఘ – అర్జున్, లేదంటే ఆది – మేఘల మధ్య తిరుగుతుంది. అమ్మ పాత్రకు తప్ప మరో పాత్రకు ఛాన్స్ లేదు. దాంతో ప్రేక్షకుడ్ని ఒకే చోట బంధీ చేసేసినట్టు ఉంటుంది. తొలి సగం త్వరగా గడిచిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ద్వితీయార్థం సైతం రన్ టైమ్ తక్కువే. కానీ లెంగ్తీ సినిమా చూసినట్టు ఉంటుంది. కారణం.. కథనంలో స్పీడు లేకపోవడం. క్లైమాక్స్ కాస్త షాకింగే. ఈ షాక్ కన్నడ ప్రేక్షకులకు మరింత నచ్చి ఉంటుంది. తెలుగులో ఇలాంటి క్లైమాక్స్.. కాస్త కష్టమే. ఎందుకంటే మన కథలన్నీ సుఖాంతం అవ్వాల్సిందే. ఈ క్లైమాక్స్ చూస్తే.. ఈ సినిమాని అర్థాంతరంగా ముగించాడేంటి అనిపిస్తుంది.
మేఘా ఆకాష్ చాలా అందంగా ఉంది. నవ్వితే మరింత బాగుంది. ఏడ్చినా నవ్వినంత క్యూట్ గా కనిపిస్తుంది. కాకపోతే…. అదే కాస్త మైనస్. ఎందుకంటే మేఘ పాత్రని చూడగానే సింపతీ క్రియేట్ అవ్వాలి. అది ఇక్కడ జరగలేదు. అదిత్ చాలా బాగా చేశాడు. కాకపోతే. ఆ పాత్రకు ఇంకాస్త ఎనర్జీ దట్టించాల్సింది. అర్జున్ స్క్రీన్ కి కొత్త. ఇంకా అనుభవం సంపాదించాలి. పవిత్ర లోకేష్ పాత్ర హుందాగా ఉంది. ఓ మంచి అమ్మ పాత్రని చాలా కాలం తరవాత చూసిన ఫీలింగ్.
ఆండ్రూ కెమెరా పనితనం బాగుంది. తక్కువ లొకేషన్లు.. పరిమిత బడ్జెట్ – అయినా సరే కలర్ ఫుల్ గా ఉంది. గౌర హరి అందించిన పాటలన్నీ మెలోడీలే. `ఆమని ఉంటే` పాటలో భావం ఆకట్టుకుంటుంది. దియా లాంటి ఉదాత్తమైన కథని తెలుగు ప్రేక్షకులకూ అందించాలన్న తపన దర్శక నిర్మాతలది. కాకపోతే.. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకోలేకపోయారు. దియా చూసిన వాళ్లకు ఈ సినిమా పక్కా కాపీ పేస్ట్ లా ఉంటుంది. అలాగని మరీ తీసిపారేయాల్సిందేం లేదు. స్లో సినిమాల్ని, భారమైన క్లైమాక్సుల్నీ ఇష్టపడే ఓ వర్గం ఉంటుంది. వాళ్లకు ఈ సినిమా నచ్చొచ్చు. అయితే వాళ్లు కూడా కన్నడ దియా చూడకపోతేనే.
తెలుగు360 రేటింగ్: 2.5/5