కరోనా పరిస్థితుల కారణంగా నలిగిపోయిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం ఊహించనంత సాయం చేస్తోంది. పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న వాటికి రీస్టార్ట్ పేరుతో ప్యాకేజీ ప్రకటించి పంపణీ చేస్తున్నారు. ఈ రోజు ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్లులకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఎంఎస్ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్లులకు రూ.684 కోట్లు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో 12 లక్షల మందికి ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్లులు ఉపాధి కల్పిస్తున్నాయి.
కరోనా కారణంగా కారణంగా కార్యకలాపాలు నిలిచిపోవడంతో వాటికి ఇబ్బంది ఏర్పడింది. అయితే నిర్వహణ సమస్య రాకుండా చూడటానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. కరోనా ఎఫెక్ట్ పరిశ్రమలపైనే కాదు ప్రభుత్వంపై కూడా ఉంది. అయినా అప్పులు చేసైనా ఆర్థిక వ్యవస్థను గాడిలో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. గత ఏడాది మే 22న దేశంలోనే తొలిసారిగా రీస్టార్ట్ ప్యాకేజీ పేరుతో రూ.1,100 కోట్ల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
గత ప్రభుత్వం లో ఉన్న బకాయిలు కూడా చెల్లిస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. రాయితీలను కూడా సకాలంలో చెల్లించడం ద్వారా రాష్ట్రంపై పారిశ్రామికవేత్తల నమ్మకాన్ని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సంస్థలు పెట్టుబడుల ప్రతిపాదనలు సమర్పించాయి. అవన్నీ గ్రౌండింంగ్ అయితే పారిశ్రామిక పరంగా ఏపీ బాగా ముందుకెళ్తుంది.