వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమానికి వైఎస్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగిన నేతలు ఎవరూ హాజరు కాలేదు. ఏపీ నుంచి కేవీపీ, ఉండవల్లి, రఘురావీరారెడ్డి మాత్రమే హాజరయ్యారు. తెలంగాణ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జితేందర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ మాత్రమే హాజరయ్యారు. ఇతర పార్టీల్లో కీలక స్థానాల్లో ఉన్న వైఎస్ ఆత్మీయులెవరూ హాజరుకాలేదు. రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం అని వైఎస్ విజయలక్ష్మి అందర్నీ పేరు పేరునా పలిచారు. వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఆహ్వానించారు. దీంతో హాజరు ఎక్కువగానే ఉంటుందనుకున్నారు. కానీ ఏపీ సీఎం జగన్ కూడా ఆ సమావేశం పట్ల నిరాసక్తతత వ్యక్తం చేయడంతో ఇక ఎవరూ వెళ్లడానికి ధైర్యం చేయలేకపోయారు.
వైఎస్ ఆత్మీయులుగా పేరు పడిన వారు వైసీపీలో ఎక్కువగా ఉన్నారు. వారెవరూ హాజరు కాలేదు. చివరికి సీఎం జగన్ కూడా హాజరు కాలేదు. ఇక తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్లో ఉన్న నేతలెవరూ రాలేదు. వైఎస్ సంస్మరణను రాజకీయ కార్యక్రమంగానే భావించారు. అయితే టీ పీసీసీతో విబేధిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం హాజరయ్యారు. ఆయన హాజరవడమే కాదు మీడియాతో మాట్లాడుతూ టీ పీసీసీపై విమర్శలు చేశారు. మూడు రోజుల పాటు నిద్రపోయారా.. మూడు గంటల ముందు చెప్పడం ఏమిటని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన తీరుపై టీ కాంగ్రెస్‌లో మరోసారి చర్చ ప్రారంభమైంది. ఇక బీజేపీలో ఉన్న జితేందర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు.
వైఎస్ హయాంలో మేళ్లు పొందిన పలువురు సినీ ప్రముఖుల్ని కూడా ఆహ్వానించారు. అలాగే చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, కృష్ణ వంటి వారికి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి. కానీ ఎవరూ హాజరు కాలేదు. కృష్ణ వీడియో సందేశాన్ని పంపించారు. మోహన్ బాబు ఆడియో సందేశాన్ని పంపించారు. ఇక చిరంజీవి, నాగార్జున స్పందించలేదు. బహుశా వైసీపీ అధినేత జగన్ ఈ కూటమి సమావేశం పట్ల సంతృప్తిగా ఉంటే వీరు హాజరయి ఉండేవారని అంటున్నారు. అయితే వైఎస్ హయాంలో అవకాశాలు పొందిన పలువురు తమ కృతజ్ఞత చాటుకోవడానికి వచ్చారు.
అయితే సమావేశంలో వైఎస్ విజయలక్ష్మి రాజకీయమే మాట్లాడారు. తన బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. రాజకీయాలకు అతీతం అని చెప్పినప్పటికీ అది రాజకీయ కార్యక్రమంగానే సాగింది. దీంతో హాజరు కాకపోవడమే మంచిదయిందని ఇతర పార్టీల నేతలు సంతృప్తి పడ్డారు. ఈ కార్యక్రమానికి ఏబీఎన్ చానల్ మంచి కవరేజీ ఇవ్వగా.. వైఎస్ బొమ్మను లోగోలో ఇమిడ్చేసుకున్న సాక్షి మాత్రం అసలు కవరేజీ ఇవ్వలేదు .