వారంలో సీపీఎస్ రద్దు అంటూ ఇచ్చిన హామీని నెరవేర్చనందుకు ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కాయి. దీంతో ప్రభుత్వానికి పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆ సీపీఎస్‌ను ఎలా రద్దు చేయాలన్నదానిపై కిందా మీదా పడుతోంది. టక్కర్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం సీపీఎస్ రద్దు చేయడం లేదా అవే ప్రయోజాలను కల్పించడం అనే రెండు పరిష్కారాలు ప్రభుత్వం ముందు ఉన్నాయి. కానీ అలా రద్దు చేస్తే పడే ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వం తట్టుకునేలా లేదు. అవే ప్రయోజనాలు కల్పించినా అంతే. అందుకే ఏపీ ప్రభుత్వం ముందూ వెనుకా ఆలోచిస్తోంది. ఇప్పుడు కొత్తగా వైసీపీ నేతలు ఇది కేంద్రం చేతుల్లో ఉందనే వాదన వినిపించారు. వైసీపీ నేతలు ఉద్యోగ సంఘాల నేతలకు అదే చెబుతున్నారు.
ఉద్యోగ సంఘాల నేతలు కేంద్రం సహకరించడంలేదన్న అభిప్రాయాన్ని కింది ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం పూర్తిగా కేంద్రంపై వైఫల్యాన్ని నెట్టేసి తాము సేఫ్ సైడ్ వెళ్లాలనుకుంటోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఈ విషయంలో జోరుగా ప్రచారం జరుగుతున్నా ఏపీ బీజేపీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. సోము వీర్రాజు మాత్రం ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. సీపీఎస్ రద్దుకు కేంద్రానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేసుకుంటే చేసుకోవచ్చి ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం ఉద్యోగులకు ఆన్యాయం చేస్తోందని సీపీఎస్ కింద ఉద్యోగుల జీతాల నుంచి కత్తిరించే పదిశాతం జీతానికి మరో పద్నాలుగు శాతం కలపాల్సి ఉన్నా… అలా చేయకుండా కేవలం పది శాతం మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెన్షన్ ఫండ్‌ను కేంద్రమే నిర్వహిస్తుంది. అంత మాత్రాన రాష్ట్రాలకు నిర్బంధంగా ఆ ఫండ్‌లో ఉండాలని ఉద్యోగులందర్నీ సీపీఎస్‌లో ఉంచాలనేమీ లేదు. కానీ బయటకు రావాలంటే మాత్రం అనేక ఆర్థిక కష్టనష్టాలకు గురి కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాటిని భరించే స్థితిలో ఏపీ ప్రభుత్వం లేదు. అందుకే కేంద్రాన్ని కారణంగా చూపి రాజకీయం చేసి బండి నడిపించేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.