ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకే అప్పులు చేసి నగదు బదిలీ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అప్పోసప్పో చేసైనా సరే అందించిన డబ్బే ఒక రాష్ట్రానికైనా, దేశానికైనా సంజీవని అవుతుందని అంతర్జాతీయ ఆర్థిక వేత్తలు చెప్పారని సీఎం జగన్ చిన్న పరిశ్రమల రాయితీలు విడుదల చేసే కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అయితే అప్పులు చేయడాన్ని కూడా టీడీపీతో పాటు కొన్ని టీవీ చానళ్లు కూడా తప్పు పడుతున్నాయని ఆక్షేపించారు. ప్రజలను కాపాడుకునేందుకు అప్పోసప్పో చేస్తే దాన్ని కూడా నెగెటివ్‌గా చూపిస్తున్నారని విమర్శించారు.
గత ప్రభుత్వంలో హడావుడి ఎక్కువ . . పని తక్కువ అని జగన్ విమర్శించారు. పరిశ్రమలు రాక ముందే వచ్చేసినట్లుగా ప్రచారం చేసుకునేవారన్నారు. పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారు, కాగితాల మీద అగ్రిమెంట్లు పెట్టుకునేవారు, ఆ రోజుల్లో అక్కడ ఏమీ జరక్కముందే.. మైక్రోసాఫ్ట్ వచ్చేసింది.. ఎయిర్‌బస్ వచ్చేసింది అని ప్రచారం చేసేవారని ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కనపెట్టి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయకుండా నిజంగానే పరిశ్రమలను తీసుకురావడానికి అడుగులు ముందుకేస్తున్నామని జగన్ ప్రకటించారు.
ప్రస్తుత ప్రభుత్వంలో పరిశ్రమలు ఎక్కడ వస్తున్నాయో.. మన కళ్లముందే కనిపిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు కూడా మన కళ్లముందే కనిపిస్తున్నాయని గుర్తు చేశారు. పరిశ్రమలు రావాలంటే అనుకూల వాతావరణం ఉండాలని ప్రభుత్వం ఇన్సెంటివ్‌లు కరెక్ట్‌గా ఇస్తే పరిశ్రమలు వస్తాయన్నారు. మన ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ రూ.30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. దీనిద్వారా 46,199 మందికి ఉపాధి లభించిందని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. పరిశ్రమలు రావడమే కాదు, కొనుగోలు శక్తి ప్రజలకు ఉన్నప్పుడే ఆ పరిశ్రమలు నిలబెడతాయి. అది లేకపోతే పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయన్నారు.