పిలిచి పిల్లనిస్తానంటే కట్నం ఎంత అని అడిగాడట వెనుకటికి ఎవడో…కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే ఉంది. హుజురాబాద్‌లో పోటీకి ఎవరూ లేక దిక్కులు చూస్తూంటే కొండా సురేఖ అయితే బాగుంటుందని ఆమెను అడిగారు. ఆశల్లేకపోయినా సరే పార్టీ అడిగింది కదా అని ఆమె ఓకే అన్నారు. అయితే ఇప్పుడు… అక్కడేదో హుజురాబాద్ టిక్కెట్ కోసం పదుల సంఖ్యలో బలమైన నేతలు పోటీ పడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తున్న కాంగ్రెస్ నేతలు టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ షో ప్రారంభించారు. కొంత ధర నిర్ణయించి ఐదో తేదీ వరకూ సమయం ఇచ్చారు.
అయితే అక్కడ పోటీ చేయాలనే ఆలోచనే మొదట్లో లేని కొండా సురేఖ దరఖాస్తు చేసుకోవాలని అనుకోవడం లేదు. పార్టీ కోరితే మాత్రమే పోటీ చేస్తానంటున్నారు. దీంతో ఇప్పుడు ఎన్నికల బాధ్యతలు తీసుకున్న దామోదర్ రాజనర్సింహ, భట్టి విక్రమార్కలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కొంత మంది ఇతర నేతలు పోటీకి సిద్ధపడుతున్నా పోటీ ఇచ్చే స్థాయి వారిది కాదు. టిక్కెట్ ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఇచ్చే ఆఫర్లకు వాళ్లు జంప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కొండా సురేఖ అయితే స్ట్రాంగ్‌గా నిలబడారు.
అందుకే ఎలాగోలా పోటీకి ఒప్పుకున్న కొండా సురేఖకు బీఫాం ఇవ్వకుండా .. అక్కడ లెక్కలేనంత మంది నేతలు ఉన్నట్లుగా దరఖాస్తుల ప్రక్రియ పెట్టడంతో కొండా సురేఖ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. దరఖాస్తు చేసుకుని మరీ పోటీ చేయాల్సిన అవసరం తనకేమిటని ఆమె అనుకుంటోంది. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నా అక్కడ నేతలు మాత్రం ఈగోలు మాత్రం తగ్గించుకోరని తాజా పరిణామాలతో తేలిపోయింది.